షాకిచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి రేటింగ్స్ కోట్లు పెట్టి హక్కులు కొనుగోలు చేసిన మాటీవీ టీఆర్పీల్లో శతమానంభవతిని కూడా ఎదుర్కోలేకపోయిన శాతకర్ణి

సినిమాకు ఎంత డబ్బు వసూలైతే.. అంత సినిమా అనేది మామూలుగా లెక్కలు గట్టే పద్ధతి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ కాస్తా మారి టీఆర్పీ రేటింగ్స్ కొలమానంగా మారాయి. ఎందుకంటే లెక్కలు సరిగ్గా లెక్క తేలని కలెక్షన్స్ కౌంటింగ్ కన్నా... రేటింగ్స్ లో ఏ సినిమా ఎక్కువ పాయింట్లు సాధిస్తే ఆసినిమానే టాప్ అని ఇప్పుడున్న ట్రేడ్ ట్రెండ్ చెప్తోంది. బాక్సాఫీస్‌ లెక్కల కంటే సదరు సినిమా యొక్క టీఆర్పీ రేటింగులే కొలమానంగా నిలుస్తాయి.

థియేటర్లో ఒక సినిమా చూసేందుకు జనం ఎగబడిపోవడానికి అనేక కారణాలుంటాయి. కానీ టీవీలో వచ్చినపుడు మిస్‌ కాకుండా చూస్తుంటారు. ఇక హిట్‌ సినిమాలకైతే టీఆర్పీల పంట పండిపోతుంది. అందుకే హిట్‌ సినిమాలని అన్ని కోట్లు పోసి కొనేస్తుంటారు. సంక్రాంతికి విడుదలై, కమర్షియల్‌ లెక్కల ప్రకారం 'హిట్‌' అనిపించుకున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' టీవీ ప్రీమియర్‌తో శాటిలైట్‌ రైట్స్‌ తీసుకున్న మా టీవీకి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.

ఉగాదికి ప్రసారమైన ఈ చిత్రానికి పేలవమైన రేటింగ్స్‌ వచ్చాయి. మరోవైపు దీనికి మూడింతలు రేటింగ్స్‌ అదే రోజు జీ తెలుగులో ప్రసారమైన 'శతమానం భవతి'కి వచ్చాయి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' రిలీజ్‌ అయినపుడే అంచనాలని అందుకోలేదని, విషయం లేక వార్‌ సీన్లతో సినిమా మొత్తం గడిపేసారని విమర్శలు వచ్చాయి. అయితే అప్పుడు వచ్చిన ఓపెనింగ్స్‌ చూపించి తమ చిత్రమో చారిత్రక కళాఖండమని చెప్పుకున్నారు చిత్ర బృందం. 

అయితే ఈ గౌతమిపుత్ర గొప్పతనం కేవలం థియేటర్లలో వారం రోజుల వైభవం అని ఈ టీఆర్పీలు తేటతెల్లం చేసాయి. అప్పుడు వచ్చిన విమర్శలకి విపరీతంగా ఇదైపోయిన డైరెక్టర్‌ క్రిష్‌ ఇప్పుడీ తిరస్కారానికి, టెలివిజన్‌ డెబ్యూలో పరాభవానికి ఏమంటారో మరి.