చిత్రం : గౌతమ్ నంద తారాగణం : గోపిచంద్, హన్సిక, కేథరిన్ థ్రెసా, సచిన్ కేడ్కర్, ముఖేష్ రుషి సంగీతం : తమన్ దర్శకత్వం : సంపత్ నంది నిర్మాత : జె. భగవాన్, జె. పుల్లారావు ఆసియానెట్ రేటింగ్: 2.5/5
లౌక్యం సినిమా తర్వాత చాలా రోజులుగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ హీరో గోపీచంద్.. తన స్టైల్, బాడీలాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకొని చేసిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గౌతమ్ నంద. మాస్ హీరోయిజాన్ని సూపర్బ్ గా ఎలివేట్ చేసే సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. గోపిచంద్ ను ఆశించిన స్థాయిలో నిలబెట్టిందా..? సంపత్ నంది కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి తనన సత్తా చాటాడా..? రివ్యూలో చూద్దాం..
కథ :
ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్), ఫోర్బ్స్ లిస్ట్ ధనవంతుల్లో స్థానం సంపాదించిన తెలుగు బిలియనీర్ విష్ణు ప్రసాద్ ఘట్టమనేని( సచిన్ కేడ్కర్) వారసుడు. ఆకలి, కష్టం, బాధ, కన్నీళ్లులతో పాటు ప్రేమ అంటే ఎంటో కూడా తెలియకుండా పెరిగిన యువకుడు. ఎప్పుడూ.. పార్టీలు పబ్ లు అంటూ తిరిగే గౌతమ్ కు ఒక సంఘటన మూలంగా.. తను ఎవరు..? విష్ణు ప్రసాద్ కొడుకుగా కాక తనకంటూ వ్యక్తిగతంగా ఉన్న గుర్తింపు ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతుంది..? ఆ ఆలోచనలోనే గమ్యం తెలియకుండా ప్రయాణిస్తున్న గౌతమ్ కు, అచ్చు గుద్దినట్టు తనలాగే ఉండే మరో వ్యక్తి నంద కిశోర్ ఎదురుపడతాడు. డబ్బు తప్ప వేరే ఏ ఎమోషన్ తెలియని గౌతమ్, డబ్బుంటే చాలు ఏదైనా చేసేయచ్చు అనే నంద, తమ స్థానాలు మార్చుకొని ఒకరి ఇంటికి ఒకరు వెళతారు.
నందు ఇంటికి వెళ్లిన గౌతమ్, వారి ప్రేమతో జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఆ కుటుంబ కష్టాలు తీర్చడానికి చిన్న ఉద్యోగంలో చేరతాడు. కానీ వరుసగా నందు కుటుంబానికి ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో తన ఆస్తి మీద కన్నేసిన విష్ణు ప్రసాద్ స్నేహితుడు ముద్ర (ముఖేష్ రుషి) మీద గౌతమ్ కు అనుమానం వస్తుంది. మరి నిజంగా ముద్రానే నందు కుటుంబాన్ని ఎటాక్ చేశాడా..? ఆ ప్రమాదాల నుంచి నందు ఫ్యామిలీని గౌతమ్ ఎలా కాపాడాడు..? చివరకు నందు, గౌతమ్ లు ఎవరి స్థానాల్లోకి వారు వచ్చారా..? అన్నదే మిగతా కథ.
ఎలా వుందంటే :
‘గౌతమ్ నంద’లో ఒకేలా ఉండే గౌతమ్-నంద తమ ఐడెంటిటీల్ని మార్చుకుంటారు. ఒకరి స్థానాల్లోకి ఇంకొకరు వెళ్తారు. కానీ డబ్బున్నోడి ఇంట్లోకి వెళ్లిన బస్తీ వాడు అక్కడే సెటిలైపోవాలని అనుకుంటాడు. అసలువాడొచ్చి అక్కడున్నవాడు నకిలీ.. నేను ఒరిజినల్ అన్నా ఆ ఇంట్లో ఉన్నవాళ్లెవ్వరూ నమ్మరు. చివరికి అతడి తల్లిదండ్రులు కూడా. దీంతో అతను నిస్సహాయుడైపోతాడు. ఐతే 30 ఏళ్లు ఆ ఇంట్లో పెరిగిన వాడు.. ఆ ఇంట్లో తన జ్నాపకాల గురించి.. తన తల్లిదండ్రులతో తనకున్న అనుభవాల గురించి గుర్తు చేసి.. నకిలీ వాడిని పట్టించేయడం ఎంత సేపు? కానీ సంపత్ నంది ఇంత చిన్న లాజిక్ కూడా పట్టించుకోలేదు. సినిమాకు కీలకమైన సన్నివేశం ఇలా ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కవలలు కాని వాళ్లు, పరస్పరం సంబంధం లేని ఇద్దరు ఒకేలా ఉండటం అన్నదే లాజిక్ కు అందని విషయం. ఇక వాళ్లిద్దరూ అనుకోకుండా కలవడం.. ఒకరి స్థానంలోకి ఇంకొకరు వెళ్లడం.. వాళ్ల కుటుంబ సభ్యులు వీళ్లను ఏమాత్రం గుర్తు పట్టకపోవడం.. లాజిక్ లేని విషయాలే. ఎంత అలవాటే అయినా... కథకు కీలకమైన సన్నివేశాన్ని కూడా అలా నడిపిస్తేనే జనాలకు ఇబ్బందిగా ఉంటుంది. అదనపు ఆకర్షణల సంగతి పక్కనబెట్టేసి అసలు విషయం చూస్తేనే తీవ్ర నిరాశ తప్పదు. దర్శకుడు సంపత్ నందికి తనకు కావాల్సినవన్నీ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రొటీన్ కథాకథనాలతో ‘గౌతమ్ నంద’ను సాదాసీదా సినిమాగా మార్చేశాడు. ఒక మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నాడు.
ఓ దశ వరకు కథను మామూలుగా నడిపించి.. ఉన్నట్లుండి ట్విస్టు ఇచ్చి ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం టాలీవుడ్లో చాలామంది దర్శకులు వేస్తున్న ఎత్తుగడ. సంపత్ నంది కూడా ‘గౌతమ్ నంద’లో అదే ట్రిక్ ప్లే చేశాడు. కానీ ఆ ట్విస్టు థ్రిల్ ఆ సమయానికి కొంచెం థ్రిల్ చేస్తుంది కానీ.. అది ప్రేక్షకులకు మింగుడుపడదు. ఈ రొటీన్ సినిమాలో అసలా ట్విస్టు సింక్ కాలేదసలు. ఈ ట్విస్టు మినహాయిస్తే ‘గౌతమ్ నంద’లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్రీఫ్ గా చెప్పాల్సిన కథను సుదీర్ఘంగా రెండున్నర గంటలు చెప్పడం.. రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించేయడం.. ‘గౌతమ్ నంద’కు పెద్ద ప్రతికూలతగా మారింది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి.. నిజమైన సంతోషానికి దూరమైపోయానని భానవతో ఉన్న వ్యక్తి.. తన ఇంటి పేరు.. తన తండ్రి పేరు లేకుండా ‘తాను’ ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో పడటంతో మొదలవుతుంది ‘గౌతమ్ నంద’ కథ. ఈ ఆరంభం చూస్తే ఒక వైవిధ్యమైన సినిమా చూడబోతున్నామన్న భావన కలుగుతుంది.
కానీ అంతలోనే ఈ హీరోలాగే ఇంకొకడుండటం.. ఇద్దరూ ఒకరి స్థానాల్లోకి ఇంకొకరు వెళ్లడం.. ఇలా రొటీన్ కమర్షియల్ దారిలోకి వచ్చేస్తుంది ‘గౌతమ్ నంద’. ఐతే స్లమ్ లో ఉండే రెండో హీరో నేపథ్యం.. బస్తీలో వచ్చే సన్నివేశాలవీ కొంచెం వినోదాత్మకంగా ఉండటంతో బండి సోసోగా నడుస్తున్నట్లే ఉంటుంది. ప్రథమార్ధం వరకు ఏదో అలా సాగిపోతుంది. కానీ ద్వితీయార్ధంలోకి వచ్చాక ‘గౌతమ్ నంద’ విసిగించడం ప్రారంభిస్తుంది. ఇటు గౌతమ్.. అటు నంద.. ఇద్దరూ కూడా బోర్ కొట్టించేస్తుంటారు. అక్కడ అతను ఐశ్వర్యాన్ని ఆస్వాదించడం తప్పితే ఇంకేమీ చూపించరు. ఇక్కడ ఇతను బస్తీలో మనుషులతో ఎమోషనల్ గా కనెక్టయ్యే సన్నివేశాలు కూడా రొటీన్ గానే ఉంటాయి. ఓ దశ దాటాక రిపిటీటివ్ గా అనిపించే సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. సినిమా ఎటు పోతోందో అర్థం కాని సందిగ్ధత మొదలవుతుంది. దశలో వచ్చే ట్విస్టు కూడా ప్రేక్షకుల్ని ఏమంత థ్రిల్ చేయదు. ముగింపు కూడా అంత మెప్పించదు. అదనపు ఆకర్షణలు మెప్పించినా.. కథాకథనాల పరంగా మాత్రం ‘గౌతమ్ నంద’ నిరాశపరిచాడు.
నటీనటులు :
మాస్ యాక్షన్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న గోపిచంద్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. మేకోవర్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా వేరియేషన్ చూపించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్న గోపిచంద్, రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ తో మెప్పించాడు. హీరోయిన్ కేథరిన్ నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా.. గ్లామర్ షోతో అదరగొట్టింది. హన్సిక స్క్రీన్ టైం కూడా తక్కువ కావటంతో ఉన్నంతలో పరవాలేదనిపించింది. విలన్లుగా ముఖేష్ రుషి, నికితిన్ ధీర్ లు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో సచిన్ కేడ్కర్, చంద్రమోహన్, సీత తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
వరుసగా కమర్షియల్ హిట్స్ సాధిస్తున్న దర్శకుడు సంపత్ నంది రెండేళ్ల విరామం తరువాత తెరకెక్కించిన సినిమా గౌతమ్‑నంద. మాస్ హీరో గోపి చంద్ ను స్టైలిష్ గా ప్రజెంట్ చేయాలనుకున్న సంపత్ నంది సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. గోపిచంద్ మేకోవర్ తో పాటు సినిమాను స్టైలిష్ గా ప్రజెంట్ చేయటం లో దర్శకుడు తీసుకున్న కేర్ సినిమాకు ప్లస్ అయ్యింది. డ్యూయల్ రోల్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే కథనే తనదైన టైకింగ్ తో కొత్తగా ప్రజెంట్ చేశాడు సంపత్. ఫస్ట్ హాఫ్ క్లాస్ గా నడిపించిన సంపత్ నంది, సెకండాఫ్ లో తన మార్క్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించాడు. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను పక్కగా యాడ్ చేసిన దర్శకుడు మరోసారి ఆకట్టుకున్నాడు. అయితే ఒక్క నంద కేరక్టర్ ధనవంతుడైన గౌతమ్ లాగా స్థిరపడాలనుకోవడం, అతన్ని చిన్నప్పటి నుంచి పెంచిన కుటుంబసభ్యులు గుర్తించకపోవడం, చివరకు అసలు గౌతమ్ తానేంట్ ప్రూవ్ చేసుకోవాల్సి రావడం లాంటి లాజిక్ లేని సీన్స్ కాస్త ఇబ్బంది పెడతాయి.
సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ సుందర్ రాజన్ సినిమాటోగ్రఫి. డ్యూయల్ రోల్ సీన్స్ చాలా నేచురల్ గా కనిపించాయి. లావిష్ గా కనిపించే గౌతమ్ ఇంటిని ఎంతో బాగా ప్రజెంట్ చేశాడో.. బోరబండ స్లమ్ ఏరియాను అంతే నేచురల్ గా చూపించాడు. తమన్ పాటలు పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. నిర్మాతలు సినిమా కోసం పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్ :
గోపిచంద్ నటన, నిర్మాణ విలువలు, యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
