Asianet News TeluguAsianet News Telugu

శాతకర్ణికి పన్ను మినహాయింపునివ్వడం తప్పేనంటున్న ఐవైఆర్ కృష్ణారావు

  • గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపునివ్వడంపై గతంలోనే విమర్శలు
  • సోషల్ మీడియాలోనూ వ్యతిరేకించిన ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
  • గౌతమి పుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు తప్పేనని మరోసారి స్పష్టం చేసిన ఐవైఆర్
former ap chief secretary ivr krishnarao brahmin corporation gauthami putra shatakarni

బాలకృష్ణ 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం చారిత్రాత్మకమైనదంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు నివ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు నివ్వడంతో రాణి రుద్రమ చిత్రానికి ఇవ్వకపోవడం సరికాదని, దర్శకుడు గుణశేఖర్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపుపై మరో వివాదం రేగుతోంది.

 

ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా..  మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ముఖ్యమంత్రి చంద్రబాబు తొలగించిన నేపథ్యంలో ఆయన ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం సందర్భంగా తాను గతతంలో గౌతమి పుత్ర శాతకకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపునివ్వడం సరికాదని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ గురించి ప్రస్తావించారు. శాతకర్ణి  మాదిరిగా తీసిన సినిమాలన్నిటికీ పన్ను మినహాయింపునివ్వకుండా అలా ఇవ్వటం తప్పుడు సంకేతాలిస్తుందన్నదే తన ఉద్దేశమని కృష్ణారావు అన్నారు. బాహుబలి లాంటి సెన్సేషనల్ మూవీకి లేని పన్ను మినహాయింపు శాతకర్ణికి ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తుందని తాను అభిప్రాయపడినట్లు కృష్ణారావు వెల్లడించారు.

 

మిగతా సినిమాలకు కూడా పన్ను మినహాయింపునిస్తే.. నిర్మాతలు రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని గొప్ప చిత్రాలు తీసే అవకాశం ఉంటుందన్నదే తన అభిప్రాయం అన్నారు. అంతేకానీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగానో చేసిన పోస్ట్ అది కాదని ఐవైఆర్ కృష్ణా రావు అన్నారు. అయినా.. కొందరు పేరు కూడా ఉచ్చరించ అర్హతలేని వాళ్లు.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, సీఎం కూడా గత ఆరు నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా.. అవమాన పరిచారని ఐవైఆర్ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios