పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి షాకయ్యా సూర్య అంటే చాలా ఇష్టం ఫిదాలో తెలంగాణ యాసకు మస్తు ప్రశంసలు ఫిదా సక్సెస్ తర్వాత చిట్ చాట్ లో సాయి పల్లవి

రీసెంట్ గా రిలీజైన వరుణ్ తేజ్, దిల్ రాజు, శేఖర్ కమ్ముల, సాయి పల్లవిల ఫిదా చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫిదా టీమ్ లో ప్రతీ ఒక్కరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జనం. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ చిత్రం విజయంలో కీలకంగా మారిన భానుమతి పాత్రలో నటించిన సాయి పల్లవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఫిదా గురించి, చిత్ర విజయం గురించి ఏమంటుందో చిట్ చాట్ విశేషాల్లో చేద్దాం.

సెన్సార్ కట్ పడుతుందనుకున్నాం... కానీ లక్కీ...

బాడకావో.. బద్మాష్.. బొక్కలిరుగ కొడుతా అనే డైలాగ్స్ అర్థం ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది. సెన్సార్ వల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో ముందు మార్చాలనుకొన్నారు. శేఖర్ కమ్ముల అలాగే ఉండాలని పట్టుబట్టారు. సెన్సార్ వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకొంటాను. ఒకవేళ వారు అభ్యంతరం చెపితే మార్చుదాం అని చెప్పారు. అయితే సెన్సార్ వాళ్లకు కూడా సమస్య లేకపోవడంతో చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నేను చెప్పిన ఫస్ట్ డైలాగ్‌కు ప్రాబ్లం వస్తుందోననే ఆందోళన కలిగింది. అయితే డబ్బింగ్ చెప్పడంలో మజా అనిపించింది. షూటింగ్‌లో చెప్పిన డైలాగ్స్‌ కు డబ్బింగ్‌లో లిప్ సింక్ అవుతుందా అనే భయం ఉండేది. అందుకోసం చాలా కష్టపడ్డాను. డైలాగ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేశాను. తెరమీద సొంత గొంతుతో డైలాగ్స్ వింటూ ఉంటే మంచి ఫీల్ కలుగుతుంది.

సూర్య అంటే చాలా ఇష్టం...

ఫిదా చిత్రంలో ఓ సన్నివేశంలో వరుణ్ తేజ్‌తో మాట్లాడుతూ.. బ్లడ్‌లో పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు ఉంటే ఆ కిక్కు వేరుగా ఉంటుంది అని అంటుంది. అదే విషయాన్ని ప్రస్తావించగా నా బ్లడ్‌లో సూర్య ఉన్నాడు. తమిళంలో కాకా కాకా చిత్రం చూసిన తర్వాత సూర్య అభిమానిగా మారిపోయాను. సూర్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం ఉంటే నేను నటిస్తాను.

తెలంగాణ యాసకు ప్రశంసలు వచ్చాయి...

ఫిదా ముందు తెలంగాణ యాస మాట్లాడాలంటే భయమేసేది. ఈ సినిమా చూసిన తర్వాత నా పిల్లలను తెలంగాణ యాసలో మాట్లాడాలని నా కూతుళ్లకు చెప్పాను అని ఓ వ్యక్తి చెప్పడం సంతోషం కలిగించింది. ప్రేక్షకుల మీద నా పాత్ర అంత ప్రభావం చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది. నటికి ఇంతకంటే ఏమి కావాలి. ఫిదా తర్వాత నేను అందుకొన్న మంచి ప్రశంసల్లో ఇది ఒకటి.

పవన్ కళ్యాణ్ క్రేజ్ కు షాకయ్యా...

థియేటర్లలో పవన్ కల్యాణ్ కనిపించినప్పుడు వచ్చి రెస్సాన్స్ చూసి కంగు తిన్నాను. ఓ దశలో నా డైలాగ్స్‌కు చప్పట్లు కొడుతున్నారా లేదా పవన్ చూసి క్లాప్స్ కొడుతున్నారా అర్థం కాలేదు. ఆ చప్పట్లతో నా డైలాగ్స్ మిస్ అవుతాయోమోనని భయపడ్డా. కానీ ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకొన్నారని అర్థమైంది. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆడియో ఫంక్షన్‌లో పవన్ పేరు చెపితే.. హాలంతా చప్పట్లతో మారిమోగిపోయింది. ఆయనకు ఉన్న క్రేజ్ చూసి షాక్ తిన్నాను.

నానితో నటిస్తున్నా...

ఒకసారి ఒకే సినిమాలో నటించాలి అనే రూల్ ఏమీ లేదు. ఇక ముందు వరుస చిత్రాలు చేస్తాను. నాగశౌర్యతో సినిమా ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం ఎంసీఏ చిత్రంలో నాని సరసన నటిస్తున్నాను. ఈ చిత్రానికి శ్రీరాం దర్వకత్వం వహిస్తున్నారు. అంటూ ముగించింది ఫిదా భానుమతి సాయి పల్లవి.