ప్రియా వారియర్.. ఇప్పుడు ఈ చిన్నది ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. కేవలం 26 సెకన్ల వీడియోతో ఈమె సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏళ్లకేళ్లు కష్టపడినా రానంత గుర్తింపు.. ఒక్క చిన్న వీడియోలో కనిపించిన ఎక్స్ ప్రెషన్స్ తో వచ్చేసింది. 

ఒరు అడార్ లవ్ మూవీ ప్రమోషన్ కోసం సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఇందులో కనిపించిన ప్రియా వారియర్ ముఖంలో కనిపించిన భావాలు అందరినీ తెగ మెప్పించేశాయి. ఇలా పాపులర్ కావడానికి కారణం.. సోషల్ మీడియా వ్యాప్తి అని అంగీకరించాల్సిందే. ఇలా సడెన్ గా క్రేజ్ సంపాదించుకున్న గతంలోనూ కొందరు ఉన్నారు. 

పాకిస్తాన్ లో అర్షద్ ఖాన్ అనే టీ విక్రేత గురించి గతంలో ఎవరికీ తెలియదు. కానీ ఈ నీలికళ్ల కుర్రాడు టీ పోస్తుండగా తీసిన ఒక ఫోటో నెట్ లోకి రావడం.. వైరల్ అయిపోవడం.. క్రేజ్ తెచ్చుకోవడం జరిగిపోయాయి. 

రాబర్ట్ ఈ కెల్లీ అనే ఎనలిస్ట్ సడెన్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడానికి కారణం ఓ వీడియో. ఈయన చాలా కార్యక్రమాల కోసం టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండచ్చు కానీ.. వెనుకాల డోర్ ఓపెన్ చేసుకుని పిల్లలు రావడం.. ఈయన ఇబ్బందులు.. అర్ధాంగి పరుగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్లే వీడియో కారణంగా ప్రపంచం అందరికీ తెలిసిపోయాడు. 

షారూక్ ఖాన్ తన మూవీ రయీస్ ప్రచారం కోసం చాలా ఊళ్లే తిరిగాడు. బోలెడన్ని ఫోటోలను తీసి.. సెల్పీలను తీసుకుని నెట్ లో పెట్టాడు. వీటిలో ఒకటి వైరల్ అయింది. ఇందుకు కారణం షారూక్ కాదు.. ఆ ఫోటోలో ముందు వరుసలో నుంచున్న ఓ అమ్మాయిని.. సడెన్ గా స్టార్ చేసేసింది సోషల్ మీడియా.

సెల్ఫీ మై నే లే లీ ఆజ్ అంటూ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ పాడిన పాట యూట్యూబ్ లోకి రావడం ఆలస్యం వైరల్ అయిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పూజా జైన్ అనే అమ్మాయిని అప్పటికప్పుడే స్టార్ చేసి పారేసింది. 

పాకిస్తాని సింగర్ తాహెర్ షా కూడా ఇలాగే హఠాత్తుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐ టు ఐ పాట కారణంగా 2013లోనే ఇతను సూపర్బ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఫన్నీ యాంగిల్ లో అయినా సరే.. ఇతనికి సడెన్ గా లభించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 

ఇంతకీ ఇలా వైరల్ గా మారేందుకు సీక్రెట్ ఏంటా అంటే.. వారు కూడా ఏం సమాధానం చెప్పలేరు.