అలనాటి అందాల తార శ్రీదేవి మృతిని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఆ అద్భుత సౌందర్యం ఇక లేదంటే నమ్మేందుకే చాలామంది సిద్ధంగా లేరు. జీర్ణించుకోవడం కష్టమే అయినా.. శ్రీదేవి స్వర్గానికి వెళ్లిపోయిందనే వార్తను మెల్లగా దిగమింగుతున్నారు అభిమానులు. అటు సినిమా రంగం నుంచి క్రీడా రంగం వరకూ.. రాజకీయ రంగం నుంచి సామాన్యుల వరకూ ప్రతీ ఒక్కరినీ శ్రీదేవి మరణం కదిలించివేసింది. 

అన్నివైపుల నుంచి ఆశ్చర్యంతో పాటు సానుభూతి కూడా కురుస్తోంది. అయితే.. అనేక మంది శ్రీదేవి మరణంపై బాధపడుతుంటే.. కొందరు మాత్రం కారణాలు వెతుక్కుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అందం కోసం పాకులాడడం కారణంగా.. అనేక సర్జరీలు చేయించుకోవడం.. విటమిన్ ట్యాబ్లెట్లు మింగడం.. ఇలాంటి వాటి కారణంగానే ఆమె ఇంత త్వరగా మృతి చెందిందని.. హార్ట్ అటాక్ వచ్చిందని విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. బాలీవుడ్ ఫిలిం మేకర్ ఏక్తా కపూర్ ఈ విమర్శలపై స్పందించారు. 

'ఓ హృదయం లేని మనుషులారా.. ఎటువంటి గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా.. సర్జరీలు చేయించుకోకపోయినా వందలో ఒకరికి సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని మా డాక్టర్ చెప్పారు. ఇది విధి మాత్రమే. మీరు ఇలాంటి రూమర్లు ఆపండి. ఎంతో శక్తివంతురాలైన మహిళకు ఎంతో బలహీనమైన గుండె ఉండవచ్చు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలుగుగాక' అంటూ ట్వీట్ చేసింది ఏక్తా కపూర్.