ప్రముఖ సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. విజయ్ దేవరకొండ, రానా సహా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖులపై కేసు నమోదు అయ్యింది. అందులో ఎవరెవరు ఉన్నారంటే?
టాలీవుడ్ స్టార్స్ కు షాక్ ఇచ్చింది ఈడీ. రానా, విజయ్ దేవరకొండ సహా.. మొత్తం 29 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకుంది.
ఈ కేసులో స్టార్ హీరోలైన విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి తో పాటు తెలుగు నటీనటులు ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరంతా పలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసు నమోదు చేశారు.
ఇక సోషల్ మీడియాలో హైప్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత పేర్లు కూడా ఈడీ నమోదు చేసిన లిస్ట్‌లో ఉన్నాయి. అలాగే మరికొంతమంది యూట్యూబర్లు, ఇతర సోషల్ మీడియా సెలబ్రిటీలపైనా కేసులు నమోదయ్యాయి.
పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే యాంకర్లు విష్ణు ప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన విషయం తెలిసిందే. వీరంతా ప్రమోట్ చేసిన యాప్‌లు భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించినవి కావడంతో, ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి సారించింది.
ఈడీ విచారణకు కారణమైన యాప్‌లలో జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్‌విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధనిబుక్ 365, మామ247, తెలుగు365, ఎస్365, జై365, జెట్‌ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 వంటి వాటి పేర్లు ఉన్నాయి. వీటిని ప్రమోట్ చేసిన యాప్ యజమానులపై ఇప్పటికే 19 కేసులు పోలీసులు నమోదు చేశారు.
కేసు నమోదు కావడంతో ఈడీ విచారణ మరింత వేగంగా సాగే అవకాశముంది. ఇప్పటికే పలు ప్రముఖుల నుండి స్టేట్‌మెంట్లు రికార్డు చేయడానికి ఈడీ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. త్వరలో మరికొంత మంది ప్రముఖులు ఈ విచారణలో హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేపింది. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాంకర్లు, నటీనటులు ఈ ప్రొమోషన్లలో భాగమైనట్టు స్పష్టమవుతున్న నేపథ్యంలో మరిన్ని విచారణలు సాగనున్నాయి. ఇకపై సెలబ్రిటీలకు ప్రొమోషన్ ఒప్పందాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


