ప్రముఖ నటుడు, నిర్మాత దుల్కర్ సల్మాన్ నిర్మించిన తాజా చిత్రం ‘లోక చాప్టర్ 1 చంద్ర’. ఈసినిమా ప్రస్తుతం వివాదంలో నిలిచింది. ఈ సినిమా వివాదానికి సబంధించి హీరో దుల్కార్ సల్మాన్ తాజాగా క్షమాపణలు కూడా చెప్పారు. ఇంతకీ విషయం ఏంటి?
హీరోగా నిర్మాతగా దూసుకుపోతున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. తాజాగా ఆయన నిర్మించిన సినిమా ‘లోక చాప్టర్ 1 చంద్ర’. ఈ చిత్రంలో ఒక డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది అన్న విమర్శల నేపథ్యంలో, దుల్కర్ నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ అధికారికంగా స్పందించి క్షమాపణలు తెలిపింది. ఇటీవల మలయాళంలో విడుదలై విజయవంతమైన ఈ చిత్రం, తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమా క్లైమాక్స్‌లో విలన్ పాత్రధారి బెంగళూరుకు చెందిన అమ్మాయిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు వచ్చాయి.
అంతే కాదు ఈసినిమాలో ‘దగర్’ అనే పదం వాడటం కూడా పలువురు సోషల్ మీడియా వినియోగదారుల ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో, కర్ణాటకకు చెందిన నెటిజన్లు, ప్రజలు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించడంతో, దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేఫరర్ ఫిల్మ్స్ తరపున వచ్చిన ఆ ప్రకటనలో వారు ఇలా తెలిపారు. "మా సినిమాలోని ఒక సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను అనుకోకుండా దెబ్బతీసిందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై మేము నిజంగా చింతిస్తున్నాం. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఆ సంభాషణను వీలైనంత త్వరగా సినిమా నుండి తొలగించడం లేదా మార్చడం జరుగుతుంది. మేము కలిగించిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మా క్షమాపణను అంగీకరించండి." అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రాన్ని డామినిక్ అరుణ్ డైరెక్ట్ చేయగా, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. నస్లేన్ ప్రధాన పాత్రలో పోషించారు. 2025 ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలై మంచి బాక్సాఫీస్ వసూళ్లు సాధిస్తున్న సమయంలోనే ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంపై చిత్ర యూనిట్ బాధ్యతాయుతంగా స్పందించి, వెంటనే మార్పులు చేస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు ఈమధ్య కామన్ గా మారాయి. ఈ క్రమంలో కన్నడ ప్రజలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎమైనా స్పందన వస్తుందో లేదో చూడాలి.


