- Home
- Entertainment
- అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో ఇప్పుడు ఏం కొనొచ్చు?
అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో ఇప్పుడు ఏం కొనొచ్చు?
తెలుగు పరిశ్రమకు ఎన్టీఆర్ ఒక కన్ను అయితే ఏఎన్నారో మరో కన్ను, వారి వేసిన బాటలో టాలీవుడ్ కొనసాగుతోంది. ఏఎన్నార్ సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆయన కెరీర్ లో అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇప్పుడు ఆ డబ్బుతో ఏం కొనవచ్చు?

తెలుగు సినీ ప్రపంచాన్ని అద్భుత నటనతో మెప్పించిన అక్కినేని నాగేశ్వరరావు జన్మించి వందేళ్లు పూర్తయ్యింది. ఈమధ్య కాలంలోనే ఆయన శతజయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అరుదైన, ఇప్పటివరకు తెలియని విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన సినీ ప్రయాణం మొదలైనప్పుడు పొందిన తొలి పారితోషికం కూడా చర్చనీయాంశంగా మారింది.
అక్కినేని నాగేశ్వరరావు నటన ప్రయాణం చిన్నతనంలోనే నాటకాలతో మొదలైంది. విద్యాభ్యాసానికి సరిపడా ఆర్థిక స్థోమత లేకపోవడంతో స్కూల్‌ను నాలుగోవ తరగతిలోనే మానేసి నాటకాలకే పూర్తిగా మొగ్గుచూపారు. ఆ సమయంలో ఊరూరా తిరుగుతూ నాటకాలు వేస్తూ జీవనం సాగించారు. తొలి నాటకానికి ఆయనకు కేవలం 25 పైసలు( పావల) మాత్రమే అందుకున్నారు. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఏఎన్నార్ స్వయంగా వెల్లడించారు. ఆతరువాత కాలంలో నాగేశ్వరావు ఒక్కో నాటకానికి 5 చొప్పున అందుకున్నారట.ఇక నాగేశ్వారావు అందుకున్న తొలి పారితోషికం పావల ఇప్పుడు చెల్లని పైసాగా మారింది.
అయితే ఈ నాటకాల ద్వారానే అక్కినేని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. బెజవాడ రైల్వే స్టేషన్ వద్ద నాటక ప్రదర్శన సందర్భంగా ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారి దృష్టిలో అక్కినేని పడ్డారు. ఆయనకు అక్కినేని నటన నచ్చి సినిమా అవకాశం ఇస్తాను నాతో వస్తావా అని అడిగారట. ఏఎన్నారు సరే అనడంతో మద్రాస్ వెళ్లి సినిమాల్లో మొదటి అవకాశం పొందారు. మద్రాస్‌లో బలరామయ్యగారు ఆయనకు వసతి, భోజనం ఏర్పాటు చేయడంతో పాటు నెలకు 250 జీతంగా కూడా ఇచ్చారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితంలో తీసుకున్న మొదటి జీతం.
ఈ జీతంలోనూ నెలకు 50 రూపాయలు టిఫిన్, భోజనం కోసం ఖర్చు చేయడంతో, పాండిబజార్‌లో ఉన్న ఓ హోటల్‌కి తరచూ వెళ్లేవారట. అక్కడ ఇడ్లీ తీసుకుని రెండుసార్లు సాంబార్ తాగడాన్ని గమనించిన హోటల్ యజమాని “సాంబార్ బ్యాచ్” అంటూ కాస్త వ్యంగ్యంగా పిలిచేవాడట. కానీ ఆ మాటలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారట అక్కినేని.
సినీ పరిశ్రమలో మొదటగా ‘ధర్మపత్ని’ అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరపై కనిపించిన ఏఎన్నార్, ఆ తర్వాత ‘సీతారామ జననం’ సినిమాతో హీరోగా మారారు. అప్పటి నుండి తన జీవిత కాలంలో దాదాపు ఏడు దశాబ్దాల పాటు 259 సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఏఎన్నార్ చిత్రంతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయగా, మూడు రోజుల పాటు ఏఎన్నార్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు. ఇందులో దేవదాసు, ప్రేమాభిషేకం వంటి క్లాసిక్ సినిమాలు ప్రదర్శించారు.