గీతాఆర్ట్స్ బ్యానర్ లో వరుస సినిమాలు చేస్తోన్న దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేసిన 'గీతగోవిందం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా దర్శకుడు పరశురామ్ మీడియాతో ముచ్చటించారు. అల్లు శిరీష్ కి 'శ్రీరస్తు శుభమస్తు' వంటి మంచి హిట్ సినిమాను ఇచ్చిన పరశురామ్ అల్లు అర్జున్ తో కూడా కలిసి పని చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పటివరకు అది పట్టాలెక్కలేదు. అసలు ఆ ప్రాజెక్ట్ ఊసే లేదు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు పరశురామ్. ''బన్నీతో నాకు మంచి చనువు ఉంది. ఇద్దరం కథల గురించి మాట్లాడుకుంటాం. గీతగోవిందం కథ కూడా ముందు తనకే తెలుసు. తనకు నచ్చిన తరువాతే ఈ సినిమా పట్టాలెక్కింది. బన్నీతో చేయాలని నాకు కూడా ఉంది. కానీ తనకు తగిన కథ దొరికినప్పుడే చేయగలను.

నా దగ్గరున్న కథల్లో బన్నీకి బాగా సూట్ అవుతుందనిపించిన కథ తనకి చెబుతాను. ప్రస్తుతం మూడు లైన్లు నా దగ్గర ఉన్నాయి. వాటిపై వర్క్ చేయాలి. ఆ తరువాతే హీరో ఎవరనేది డిసైడ్ అవుతా'' అని వెల్లడించారు. గీతగోవిందం సినిమా గనుక మంచి సక్సెస్ అయితే బన్నీ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాడా..? చూడాలి ఏం జరుగుతుందో!