Maniratnam: మణిరత్నం ఒక సినిమాని ప్రశంసించడం చాలా అరుదు. కానీ ఆయన అభినందించారంటే అది వేరే లెవల్. ఇప్పుడు ఓ బాలీవుడ్ మూవీపై ఆయన ప్రశంసలు కురిపించడం విశేషం.
`థగ్ లైఫ్`తో నిరాశ పరిచిన మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇటీవల డైరెక్టర్ గా సక్సెస్ కాలేకపోతున్నారు. `పొన్నియిన్ సెల్వన్` రెండు చిత్రాలు డిజప్పాయింట్ చేశాయి. ఇటీవల కమల్ హాసన్‌తో చేసిన `థగ్ లైఫ్` కూడా నిరాశ పరిచింది. ఆ తర్వాత కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. ఈ క్రమంలో ఆయన చిన్న సినిమాని ప్రోత్సహించారు. ప్రశంసలు కురిపించారు. హిందీలో రూపొందిన `తు యా మైన్` మూవీని ఆయన ప్రశంసించడం విశేషం.
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న `తు యా మైన్` మూవీ
ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'తు యా మైన్' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి విశేష స్పందనను రాబడుతోంది. శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.17కోట్లు వసూలు చేసింది. నెమ్మదిగా పుంజుకుంటోంది.
మణిరత్నం ప్రశంసలు
ఈ క్రమంలో ఈ మూవీని తమిళనాడులో ప్రత్యేకంగా వీక్షించారు దర్శకుడు మణిరత్నం. అనంతరం చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. "బిజోయ్ నంబియార్ ఈ చిత్రంలో ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకువచ్చారు. ఇది థియేటర్లలో, ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం` అని ప్రశంసించారు. ప్రత్యేక ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు కూడా సినిమాపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్..
కొందరు దీన్ని `అద్భుతమైన సినిమా`గా అభివర్ణించగా, మరికొందరు ఇందులోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్టోరీటెల్లింగ్ కొత్త అనుభూతిని ఇచ్చాయని పేర్కొన్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడం సినిమా విజయాన్ని మరింత బలపరిచింది. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ పతాకంపై ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ పక్షాన వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్‌ని టార్గెట్ చేస్తూ రూపొందిన చిత్రమిది. వీక్ డేస్‌లో కూడా మంచి ఆదరణ పొందడం విశేషం.


