ఓం నమో వెంకటేశాయ చిత్రం నైజాం రైట్స్ తీసుకున్న దిల్ రాజు తెలివిగా అడ్వాన్స్ పద్దతిలో మాత్రమే తీసుకున్న దిల్ రాజు దీంతో నష్టం భారం తనపై పడకుండా తప్పించుకునే అవకాశం

తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు నిర్మాతగానే కాక డిస్ట్రిబ్యూటర్ గానూ తనదైన స్టైల్ తో దూసుకెళ్తున్నాడు. తన స్టైల్ సెపరేట్ అని మరోసారి నిరూపించాడు దిల్ రాజు. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై గతేడాది ‘సుప్రీమ్’ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు దిల్ రాజు. ఈ ఏడాది ‘శతమానం భవతి’ ‘నేను లోకల్’ చిత్రాలతో తిరుగులేని విజయాలనందుకున్నాడు. ఈ రెండు సినిమాలూ కలిపి ఓ రూ.20 కోట్ల దాకా రాజుకు లాభం తెచ్చిపెట్టి ఉంటాయని అంచనా.

నిర్మాతగా పరిస్థితి అలా ఉంటే మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ కొంత కాలంగా దిల్ రాజు హవా నడుస్తోంది. సినిమాలపై దిల్ రాజు జడ్జిమెంట్ స్కిల్స్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటారు. అయితే ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాన్ని నైజాం ఏరియాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ క్రేజ్... సినిమాపై క్రియేట్ అయిన హైప్ చూసుకుని ఈ సినిమా నైజాం రైట్స్ రూ.8.5 కోట్లకు తీసుకున్నాడు రాజు.

అయితే ‘ఓం నమో వేంకటేశాయ’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ దారుణంగా ఉంది. తొలి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.6.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది ఈ మూవీ. నైజాంలో షేర్ రూ.2 కోట్లకు కూడా చేరలేదు. ఫుల్ రన్ లో ఈ సినిమా నైజాంలో రూ.5 కోట్లు రాబట్టడం కూడా కష్టంగానే ఉంది. దీంతో దిల్ రాజుకు సగానికి సగం నష్టం తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఆసక్తికరంగా ఈ నష్టాన్ని రాజు భరించబోవట్లేదు.

ఓం నమో వేంకటేశాయ చిత్రం నైజాం హక్కుల్ని అడ్వాన్స్ కింద మాత్రమే తీసుకున్నాడు రాజు. అంటే నష్టం వస్తే అది డిస్ట్రిబ్యూటర్ భరించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆ నష్టం నిర్మాత ఎకౌంట్లోకే వెళ్తుంది. మిగతా ఏరియాల డిస్ట్రిబ్యూటర్లందరూ నో రిటర్న్స్ పాలసీ కింద హక్కులు తీసుకున్నారు. కానీ ఇక్కడ కూడా దిల్ రాజు తన ప్రత్యేకత చూపించాడు. అనుభవాన్ని రంగరించి అడ్వాన్స్ పాలసీలో హక్కులు తీసుకుని సేఫ్ అయిపోయాడు. ఇది చూసి దిల్ రాజు తెలివే తెలివి అని తెగ పొగిడేస్తున్నారు పరిశ్రమ వర్గాలు.