నితిన్, రాశిఖన్నా జంటగా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు.. హీరోయిన్ రాశిఖన్నా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెమ్యునరేషన్ విషయంలో ఆమె తనను టార్చర్ చేసిందని దిల్ రాజు చెప్పడం విశేషం.

'రాశిఖన్నా ఈ సినిమాలో నటించడానికి నాపై చాలా ఒత్తిడి చేసింది. తన మేనేజర్ ని నా ఆఫీస్ కి పంపించి ఫోన్ మీద ఫోన్ చేస్తూ నన్ను టార్చర్ చేసిందని' జోక్ చేశారు దిల్ రాజు. ఫైనల్ గా ఏదో విధంగా ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్న తరువాత రెమ్యునరేషన్ ఏమైనా తగ్గిస్తుందేమోనని ఆమెను అడిగే ప్రయత్నం చేశాడట దిల్ రాజు. ఆ విషయం కూడా వినకుండా తన మేనేజర్ ద్వారా తిరిగి తనపై ఒత్తిడి చేసిందని ఇలా అన్ని విషయాల్లో రాశి తన మాట నెగ్గించుకుందని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

నితిన్ కూడా రాశిపై కొన్ని కామెంట్స్ చేశాడు. 'మొదలవుదాం ప్రేమగా..' అనే పాట చిత్రీకరణ కోసం ఆరుకు వెళ్లినప్పుడు రాశి ఇదేం పాట, ట్యూన్ ఏం బాగాలేదని చెప్పింది. కానీ ఇప్పుడు మీడియా ముందు తనకు నచ్చిన పాట అదేనంటూ చెబుతోంది. రాశిఖన్నాకు ఉన్న తెలివితేటలు నాకు లేవు అంటూ నితిన్ కూడా ఆమెపై జోక్ చేశాడు.