టాలీవుడ్ బ్యూటిఫుల్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారా..? అవుననే వార్తలే ఎక్కువగా వినపడుతున్నాయి. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన సునీత.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. అంతేకాదు.. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగానూ వ్యవహరించారు. పాటలపోటీలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు.

 19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. దీంతో.. ఆమె తన పిల్లలతో ఏ తోడు లేకుండానే జీవిస్తున్నారు. అయితే.. త్వరలోనే మరో వ్యక్తిని ఆమె తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నారనే ప్రచారం మొదలైంది. 

అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరు? అన్నదానిపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కథనాలపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.