'గీత గోవిందం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి 'డియర్ కామ్రేడ్' కోసం జత కట్టారు. బాబీ, లిల్లీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శుక్రవారం నాడు థియేటర్లలోకి వచ్చారు. భ‌ర‌త్ క‌మ్మ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ అంచనాలతో సినిమా విడుదలైంది. 

అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలను ప్రదర్శించడంతో సినిమాటాక్ బయటకొచ్చింది. సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఒకసారి మాత్రమే చూడగలిగే సినిమా అని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో విజయ్, రష్మికల లవ్ ట్రాక్ బాగున్నప్పటికీ నేరేషన్ కాస్త నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నారు.

రష్మిక క్రికెటర్ గా ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు సినిమాకు ప్లస్ అని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా పరవాలేదని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో విజయ్ ఒక బైక్ ట్రిప్ తో దేశం మొత్తం శాంతిని వెతుక్కుంటూ తిరిగే సన్నివేశాలు యూత్ కి కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. 'కడలల్లే' పాట అధ్బుతంగా ఉందని కొనియాడుతున్నారు. సినిమాలో పెద్దగా సర్ప్రైజ్ లు లేకపోవడం, నేరేషన్ స్లోగా సాగడం, నిడివి ఎక్కువ అవ్వడం తప్ప సినిమాలో పెద్దగా మైనస్ లు లేవని చెబుతున్నారు.

జస్టిన్ ప్రభాకరన్ పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయని చెబుతున్నారు. సినిమా స్లోగా అనిపించినప్పటికీ విజయ్ దేవరకొండ, రష్మిక తన పెర్ఫార్మన్స్ తో ఆ ఫీలింగ్ ని పోగొట్టే  ప్రయత్నం చేశారని చెబుతున్నారు. టెర్రిఫిక్, రియలిస్టిక్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ 'డియర్ కామ్రేడ్' విజయ్ ఫ్యాన్స్ కి నచ్చడం ఖాయమట.  

'డియర్ కామ్రేడ్' ట్విట్టర్ రివ్యూ!