టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్లపై నిర్మించారు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమాను నిర్మించారు.

ప్రేక్షకుల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. విజయ్, రష్మికల హిట్ కాంబో రిపీట్ కావడం, సినిమా టీజర్, ట్రైలర్ లు ఆసక్తికరంగా ఉండడంతో యూత్ లో సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. శుక్రవారం నాడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేశారు. అమెరికాలో భారీ ఎత్తున ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన వారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ వస్తోంది. విజయ్, రష్మిక సినిమాకు ప్రధాన బలమని, స్క్రీన్ పై ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు.

దర్శకుడి నేరేషన్ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అయితే కాస్త స్లోగా ఉందని కామెంట్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ విపరీతంగా ఆకట్టుకుంటుందని, సెకండ్ హాఫ్ మాత్రం సాగదీశారని చెబుతున్నారు. అయితే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.