దాసరి నారాయణ రావు మృతికి చిరంజీవి, రామ్ చరణ్, మా సంతాపం దాసరి మృతి నన్ను కలచి వేసిందన్న చిరంజీవి మేమంతా పెద్ద దిక్కును కోల్పోయాం మా అధ్యక్ష కార్యదర్శులు శివాజీ రాజా, నరేష్

దాసరి నారాయణ రావు ఆకస్మిక మృతితో తెలుగ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని సినీప్రముఖులంతా అశ్రునివాళులర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాసరి తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు పలువురిని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ప్రముఖ హీరోలకు హిట్ చిత్రాలను అందించిన ఘనత కూడా ఆయనకు ఉంది. ఆయన మృతికి ప్రముఖ హీరో, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.

దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడటం జరిగింది. చాలా ఆరోగ్యంగా నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. దర్శక నిర్మాతగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవ‌లు అనీర్వచనీయం. ఇప్పటివరకూ తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. బౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవల‌ను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాం అని చిరంజీవి చెప్పారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కల‌గాల‌ని కోరుకుంటున్నానని రామ్ చరణ్ అన్నారు.

మరోవైపు మా అధ్యక్ష కార్యదర్శులు శివాజీ రాజా, న‌రేష్‌ లు దాసరి మృతిపట్ల సంతాపం తెలిపారు. అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని చాలా త్వ‌ర‌గా కోల్కుని మ‌ళ్లీ ఇంటికొచ్చారు. ఇటీవ‌లే ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘనంగా పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇంత‌లోనే దాస‌రి గారి గురించి ఇలాంటి వార్త‌ను వినాల్సి వ‌చ్చింది. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. మా టీమ్ అంద‌రికీ పెద్ద దిక్కులా ఉండే వ్య‌క్తిని మేము కోల్పోయాం. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో సేవ‌లందించిన వ్య‌క్తి. ద‌ర్శ‌క దిగ్గ‌జం లేర‌న్న వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాం అని `మా` అధ్య‌క్షులు శివాజీ రాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్‌ లు అన్నారు.

తెలుగు సినీ పరిశ్రమ కొండంత అండని కోల్పోయిందని నటుడు నరేష్ అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా..కార్మికులకుగాని, సినీ నటులకుగాని, ప్రొడ్యూసర్లకి గాని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తలుపుకొడితే పలికే దైవం దాసరి అని చెప్పారు. తనకు చిన్నపటి నుంచి పరిచయమున్నట్లు తెలిపారు. తాతామనవడు సినిమాలో తన తల్లి విజయ నిర్మలాని అద్భుతంగా చూపించారని నరేష్ చెప్పారు.