దర్శకరత్న దాసరికి అమరావతితో ప్రత్యేక అనుబంధం దాసరి మృతిని జీర్ణించుకోలోక పోతున్న అమరావతి వాసులు విజయవాడ, కృష్ణా, గుంటూరు వాసులతో దాసరికి ఎనలేని అనుబంధం
హీరోసెంట్రిక్ సినిమాల దశ జోరుగా సాగుతున్న దశకంలో కథనే హీరోను చేసి కథనే సినిమాకు అసలు హీరో అని నిరూపించిన దర్శకరత్నం దాసరి నారాయణరావు. ఆయన 250పైగా సినిమాలు తీసినా వాటిలో కొన్ని ప్రస్థుత ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి(గుంటూరు, కృష్ణా జిల్లాలలోనే) తీయడం విశేషం.
రీసెంట్ గా అమరావతిలో చివరగా 2017 జనవరి 7న హోటల్ ఐలాపురంలో సావిత్రి కళాపీఠం వారి క్యాలండర్‌ను దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. దాసరి ఏ చలనచిత్ర విజయోత్సవ సభకు వచ్చినా, మరెక్కడ ముఖ్య అతిథిగా పాల్గొన్నా.. తనదైన ప్రత్యేక బాణిలో మాట్లాడుతూ ఉండేవారు. ఆయన స్ఫూర్తితో దాదాపు 40 సంవత్సరాల కిందటే సంగీత సాంస్కృతిక సంస్థలను నెలకొల్పినవారు కూడా ఇక్కడ ఉన్నారంటే దాసరి ప్రభావం సమకాలీన సినీ సామాజిక రంగాలలో ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రేమాభిషేకం చలనచ్రితంలో ‘‘ ఆగదూ... ఆగదూ.. ఏ నిముషము నీకోసము అనే పాట దాసరి నారాయణ జీవితాన్ని వడగట్టి రాసిన పాట. అందుకే ప్రతి క్షణాన్ని ఆయన పవిత్రంగా వాడుకుంటూ ఉండేవారు. తన అభిమానులకు కూడా కాలం విలువను తెలియజెప్తూ ఉండేవారు. ఆయన అడుగుజాడలు సుస్పష్టంగా అమరావతి ప్రాంతాన ఎప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. సినీ పంపిణీ కార్యాలయాలకు కేంద్రమైన విజయవాడ నగరంలోని గాంధీనగర్‌లో దాసరి నారాయణరావు సినీ మీడియా పేరుతో పంపిణీ కార్యాలయాన్ని కూడా కొన్ని సంవత్సరాల పాటు నడిపారు. చిత్ర పంపిణీదారులు, ఎగ్జిబిటర్లకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకోవడంలో దాసరి ముందుండే వారు.
మూడు దశాబ్దాల క్రితం దాసరి నిర్మించిన ‘బంట్రోతు భార్య’ విజయవాడ నవరంగ్ థియేటర్‌లో 10 వారాలు ఆడి రికార్డు సృష్టించింది. ఆయన నిర్మించిన అమ్మ రాజీనామా చిత్రం సత్యనారాయణపురం, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే తీశారు. దీనికోసం ఆయన కొంత కాలంపాటు ఇక్కడే ఉన్నారు. వూరంతా సంక్రాంతి చిత్రం కూడా విజయవాడ పరిసరాల్లోనే షూటింగ్ జరిగింది. పేద, మధ్య తరగతి వర్గాల జీవనశైలి గురించి తన చిత్రాల్లో తెరకెక్కించేందుకు దాసరి నారాయణరావు రిక్షాలో తెల్లవారుజామున గాంధీనగర్, ఏలూరురోడ్డులో తిరిగి ప్రత్యక్షంగా తెలుసుకునే వారు. ఈ విషయాన్ని ఇప్పటికీ విజయవాడలో రిక్షా కార్మికులు చర్చించుకుంటారు.
ఆయన సన్నిహితుడైన నవరంగ్ థియేటర్ అధినేత ఆర్.వి.భూపాల్ ప్రసాద్ దాసరి మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తన థియేటరులో ఎక్కువ శాతం ఇంగ్లిషు చిత్రాలు ప్రదర్శించినా దాసరిపై ఉన్న అభిమానంతో ఆయన చిత్రాలను మాత్రమే ప్రదర్శించేవాడినని గుర్తు చేశారు. దాసరి భోళాశంకరుడని కలాబంధు, న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా కొనియాడారు. ఆయన కార్యాలయంలో దాసరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని శ్రీ సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మీ, గౌరవాధ్యక్షుడు ప్రభల శ్రీనివాస్ పేర్కొన్నారు. తమ సంస్థను ఎంతో ప్రోత్సహించేవారని తమ కార్యక్రమానికి చివరి సారిగా నగరానికి రావడం ఆయనతో తమకున్న అనుబంధాన్ని మరచిపోలేకపోతున్నామన్నారు. నరసింహనాయుడు, ఇంద్ర, ఒక్కడు శతదినోత్సవ వేడుకలకు విజయవాడకు విచ్చేసిన దాసరి చివరిగా ఈ ఏడాది జనవరి 7వ తేదీన నగరంలోని శ్రీ సావిత్రి కళాపీఠం వారి క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేశారు. దాసరి మృతిని కాపు సంఘాల నేతలతో పాటు అమరావతివాసులంతా జీర్ణించుకోలేక పోతున్నారు. కాపు జాతి ఉద్ధరణకు దాసరి అందించిన తోడ్పాటు మరవలేనిదని కాపు సంఘం నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
