ప్రిన్స్ మహేష్ కు తరువాత చేయబోయే సినిమాలు వరుస కట్టాయి. కానీ ఏ సినిమా అతను మొదలుపెడతాడో తెలియని పరిస్థితి. భరత్ అను నేను తరువాత వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయడానికి రెడీ అయిన ప్రిన్స్. దిల్ రాజు - అశ్వనీదత్ కలిసి ఆ సినిమా నిర్మాణానికి సిద్దమయ్యారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టడానికి సిద్దమయ్యాడు. ఇలాంటి సమయంలో పీవీపీ నిర్మాత సంస్థ కోర్టుకెళ్లింది. ఆ సినిమా నిర్మించడానికి మాకే సర్వహక్కులు ఉన్నాయంటూ కోర్టుకెక్కింది. దీంతో స్క్రిప్టు కాస్త కోర్టు ఆధీనంలోకి వెళ్లిపోయింది. కోర్టు ఇచ్చే తీర్పుపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ విషయం పక్కన పెడితే...ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. అదెంత వరకు నిజమో ఆ చిత్రయూనిట్ కే తెలియాలి. 

వంశీ పైడిపల్లి సినిమాకు పనిచేయడానికి పద్నాలుగుమంది టెక్నీషియన్లు సిద్దమయ్యారు. కోర్టు పరిధిలో ఉన్న సినిమా కోసం ఎలా పనిచేస్తారంటూ.. వారికి కూడా కోర్టు నోటీసులు పంపించినట్టు వినిపిస్తోంది. ఆ పద్నాలుగుమందిలో మ్యూజిక్ డైరెక్టర్ - కెమెరా మెన్ - డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.
కోర్టు పరిధిలో ఉన్న ఈ సినిమా విషయంలో ఏదో ఒక నిర్ణయం త్వరగా వస్తే ఫర్వాలేదు. లేకుండా మహేష్ ... వంశీ సినిమాను పక్కన పెట్టి మరో సినిమా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బహుశా అది త్రివిక్రమ్ తో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.