నటీనటులు: అంజలి, సాక్షి గులాటి, జయప్రకాశ్ వి, సప్తగిరి, స్వాతి దీక్షిత్, సుడిగాలి సుధీర్ మ్యూజిక్ డైరెక్టర్: సెల్వగణేష్ నిర్మాత: గంగపట్నం శ్రీధర్ దర్శకత్వం: అశోక్ జి

కథ...

 ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా జాయిన్ అవుతుంది చిత్ర(అంజలి). తాను చదివిన కాలేజిలోనే ప్రొఫసర్ గా అడుగుపెట్టిన చిత్ర అక్కడే హాస్టల్లో ఉంటుంది. అయితే ఆ హాస్టల్ లో దెయ్యం తిరుగుతుందని భయపడి చాలామంది అక్కడినుండి వెళ్ళిపోతారు. అయితే చిత్ర కొన్ని విషయాల్లో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇక చిత్ర శరీరంలోకి దెయ్యం ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ హాస్టల్ లో చిత్రే దెయ్యంగా మారి తిరుగుతుందని కొందరు కనిపెడతారు. కొన్ని విషయాల్లో తాను తేడాగా వుంటున్నాని గమనించి తనకేమైందోనని తెలుసుకోవడానికి చిత్ర అమెరికా వెళుతుంది. అయితే చిత్ర కి తోడుగా సప్తగిరి ఆమె వెంటనే ఉంటాడు. చిత్రకి సైకియాట్రిస్ట్ నీలకంఠ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. మరి చిత్ర నిజం గానే దెయ్యం గా మారిందా? దెయ్యం ఆమెలోకి ప్రవేశించడానికి ఏదన్న కారణం ఉందా? ఆమెకు వచ్చే కలలు ఏమిటి? అమెరికా వెళ్లిన చిత్రకి ఎలాంటి విషయాలు తెలుస్తాయి? అనేది ఖచ్చితంగా తెర మీద చూడాల్సిందే.

నటీనటులు...

అంజలి చిత్రగా మరోసారి తన నటనను రక్తి కట్టించింది. ఆమె దెయ్యంగా చేసిన నటనకు థియేటర్స్లో క్లాప్స్ పడతాయంటే అతిశయోక్తి కాదు. ఇక మగరాయుడిలా దెయ్యం పట్టినప్పుడు అంజలి చేసిన నటన అద్భుతం గా వుంది. ఆమె రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలకు న్యాయం చేసిందనే చెప్పాలి. ఇక సప్తగిరి, సుధీర్ కామెడీ ట్రాక్ అంతగా పండలేదనే చెప్పాలి. విలన్ లా దీపక్ పర్వాలేదనిపించాడు. సింధుతులాని, దీప‌క్‌, ర‌క్ష‌, సాక్షిగులాటి, జ‌య‌ప్ర‌కాష్ మిగతా న‌టీన‌టులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు...

 దర్శకుడు పిల్ల జమీందారు చిత్రంలో కామెడీకి పెద్ద పీట వేసి హిట్ కొట్టాడు. అలాగే తర్వాత అతను ఆదితో తెరకెక్కించిన సుకుమారుడు చిత్రానికి మాత్రం కామెడీని పక్కన పెట్టేసాడు. ఇక ఆ చిత్రం ఎంతటి ప్లాప్ ని చవి చూసిందో తెలిసిన విషయమే. ఇకపోతే చిత్రాంగద లో దర్శకుడు అశోక్ పూర్వ‌జ‌న్మ‌లు అనే కథకు ప్ర‌తీకారం అనే ఎలిమెంట్‌ను యాడ్ చేసి సినిమాను తెర‌కెక్కించాడు. కానీ దానిని తెర మీద చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఇక కామెడీ ట్రాక్ ను కూడా సరిగ్గా మలచలేక రొటీన్ కామెడీనే మరోసారి ఎంచుకుని చతికిల పడ్డాడు. డైలాగ్ రైటర్ గా కూడా అశోక్ ఆకట్టుకోలేకపోయాడు. రెండుమూడు డైలాగ్స్ తప్ప మరేమి ప్రేక్షకులని ఆకట్టుకునేలా లేవు ఈ చిత్రంగదలో. ఇక మ్యూజిక్ కూడా ఏమాత్రం ఆకట్టుకోక పోగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా పూర్. అయితే బాల్ రెడ్డి, జేమ్స్ క్వాన్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. హ‌ర్ర‌ర్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులకు మాత్రం ఈ చిత్రం నిరాశే మిగిలిస్తుంది..

డైరెక్టర్ అశోక్ ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగమతి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి ఇప్పుడు చిత్రాంగద సినిమా చూసిన వాళ్ళకి అశోక్ అంటే అంచనాలు తగ్గేలా వున్నాయి. ఈ చిత్రాంగద ఎఫెక్ట్ భాగమతి చిత్రంపై పడకుండా చూసుకోవాలి దర్శకుడు. ఏది ఏమైనా అశోక్ చిత్రాంగదతో ప్రేక్షకులని ఏమాత్రం మెప్పించలేకపోయాడనేది వాస్తవం. ఇక అంజలి గీతాంజలి లో హర్రర్ కామెడీతో ఇరగదీసింది. కానీ ఈ చిత్రాంగదతో ఆమెకు పూర్తి నిరాశే ఎదురవుతుందనడంలో ఏ సందేహం లేదు.

ప్లస్ పాయింట్స్... అంజలి నటన, సినిమాటోగ్ర‌ఫీ
మైనస్ పాయింట్స్...కథ, కథనం, కామెడీ, హర్రర్ కామెడీ