ఖైదీ నంబర్ 150 చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన 151వ చిత్రంపై దృష్టిపెట్టారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథను తెరకెక్కించాలని భావిస్తున్న మెగాస్టార్.. ఉయ్యాలవాడ గెటప్ సంబంధించిన స్టిల్స్ కోసం త్వరలోనే ఫోటోషూట్ నిర్వహించనున్నట్టు ఇటీవలే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో వెల్లడించారు.

 

కొణిదెల ప్రొడక్షన్‌ బేనర్ లో రూపొందే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నందున్న సురేందర్‌రెడ్డిని స్వాగతించి మెగాస్టార్ ఇంట్లో విందు కూడా చేసుకున్నారు నిర్మాత రాంచరణ్. ఈ సినిమా కథపై ఇప్పటికే పూర్తిగా కసరత్తు చేసిన సురేందర్ రెడ్డి హీరోయిన్ల ఎంపికపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ పిరియాడిక్ సినిమాలో ఓ అగ్రతారను నటింపజేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తున్నది. బాలీవుడ్ తారలైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని నిర్మాత చెర్రీ వద్ద స్పష్టం చేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

 

మెగాస్టార్ కూడా అంగీకరించడం వల్లనే మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ ని ఉయ్యాలవాడలో కచ్చితంగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ ను తీసుకొన్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా అది ధృవీకరించాల్సి ఉంది.

 

ప్రస్తుతం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం అనుకున్నదనుకున్నట్టు జరిగితే  జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాను రూ.125 కోట్ల బడ్జెట్‌తో తీయనున్నట్టు తెలిసింది. స్వాత్రంత్య సంగ్రామంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ కూడా వేయనున్నట్లు సమాచారం.