మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. తాజాగా మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడే మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. వారాహి చలన చిత్ర సంస్థ ద్వారా కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

రాకేశ్ శశి అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో చిరంజీవి ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాకు 'విజేత' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమాలలో 'విజేత' ఒకటి. ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన అల్లుడు కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకు పరిచయం కాబోతున్నారు. టైటిల్ లోగోను విడుదల చేస్తూ చిత్రబృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని ఈ పోస్టర్ లో చూపించారు. పక్క వారి ముఖాల్లో వెలుగు తీసుకురావడం కూడా మన విజయమే అంటూ ఓ క్యాప్షన్ కూడా ఉంది. రీసెంట్ గా ఈ సినిమాకు కళ్యాణ్ డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమాలో కళ్యాణ్ కు జోడీగా మాళవిక నాయర్ కనిపించనుంది.