వైజాగ్ వేదికగా రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అశేషమైన జన సందోహం మధ్య జరిగిన ఈ వేడుకలో ముందు నుంచి ఊహించినట్టుగా చిరంజీవి మాత్రమే గెస్ట్ గా వచ్చారు. ట్రైలర్ లో కథ చూచాయగా చెప్పేసినా అసలైన ట్విస్ట్ ఏంటో రివీల్ చేయకుండా సుక్కు టీం చాలా జాగ్రత్త పడ్డారు. ప్రెసిడెంట్ జగపతి బాబుతో పోటీకి దిగిన కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టికి అండగా నిలబడే అతని తమ్ముడు  చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపించడాన్ని ఫాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండు పాత్రల మధ్య బాండింగ్ చాలా బలంగా ఉంటుంది అనేది క్లారిటీ వచ్చింది కాని వీళ్ళ కథ ఎలా క్లైమాక్స్ కు చేరుకుంటుంది అనే దాని మీద మాత్రం కొన్ని సందేహాలు ఉన్నాయి. ఫంక్షన్ చివర్లో మాట్లాడిన చిరంజీవి చరణ్ గురించి పుత్రోత్సాహంతో చెబుతూ ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుంది అని చెప్పేయడంతో సుకుమార్ ఫేస్ లో చిన్న ఝలక్ కనిపించింది.

నిజానికి చిరంజీవి కావాలని రివీల్ చేయాలని చెప్పినట్టుగా లేదు. చరణ్ ఎమోషనల్ గా ఎంత అద్భుతంగా నటించాడో చెప్పబోతూ అందులో కీలకమైన ఆది డెత్ ఎపిసోడ్ అని స్లిప్ కావడంతో ఆ పాత్ర ముగింపు విషాదకరంగా ఉంటుంది అనే కన్ఫర్మేషన్ వచ్చినట్టే. ఇలా రెండు సార్లు చిరు నోటి వెంట ఆది డెత్ సీన్ అంటూ రావడంతో దానికి సంబంధించి పూర్తి క్లారిటి వచ్చేసింది. సో ప్రెసిడెంట్ కు పోటీగా దిగిన కుమార్ బాబు అలియాస్ ఆది పినిశెట్టిని ప్రత్యర్థులు చంపేస్తారు. దీంతో చిట్టిబాబు అలియాస్ రామ్ చరణ్ ఉగ్ర రూపం ఎత్తడం క్లైమాక్స్ చేర్చేలా ఉంటుందన్నమాట. కీలకమైన ఈ ట్విస్ట్ బయట పడటం వల్ల నష్టం మరీ పెద్దదిగా ఉండదు కాని థ్రిల్ అయితే మిస్ అవుతుంది. ఆది పినిశెట్టి పాత్ర చివరి దాకా బ్రతకదు అనే సింపతితోనే ప్రేక్షకుడు సినిమా చూస్తాడు కనక అదొక్కటే ఇబ్బంది కలిగించే విషయం. చిరు తన్మయత్వం లో చెప్పినా ఇంకే కారణంగా చెప్పినా గుండెలు పిండేసే ఎమోషనల్ ఎపిసోడ్ ఒకటి రివీల్ అయిపోయింది. అప్పుడే దీన్ని ఊహించుకుని అభిమానులు అంచనాలు పెంచుకోవడం మొదలుపెట్టేసారు.