చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం రూమర్లు తరువాత ఆమె ఎలా ఉన్నారు, కనిపిస్తే బాగుండు అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా మెగా మదర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంజనాదేవిని చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ జూన్ 24, మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రచారం సాగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ కొందరు వార్తలు షేర్ చేయడంతో మెగాఫ్యాన్స్ మధ్య ఆందోళన ఏర్పడింది. ఈ వార్తల నేపథ్యంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ తక్షణమే తమ కార్యక్రమాలను వదిలిపెట్టి హైదరాబాద్‌కు వెళ్లారన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
ఈ రూమర్లపై క్లారిటీ ఇవ్వాలని మెగా అభిమానులు ఆశించగా, నటుడు నాగబాబు స్వయంగా స్పందించి నిజానిజాలను వెల్లడించారు. ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించిన ఆయన, “అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెయ్యడం బాధాకరం. ఆరోగ్యపరంగా ఆమె పూర్తి స్థాయిలో క్షేమంగా ఉన్నారు” అని వెల్లడించారు. ఈ క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటికే ఈ వ్యాఖ్యలతో స్పందన వచ్చినా, అంజనాదేవి కనిపిస్తే బాగుండు అనుకుంటున్న ఫ్యాన్స్ కోసం ఒక వీడియోలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందరి సందేహాలకు పూర్తిగా చెక్ పడింది. వివరాల్లోకి వెళితే.. మొగలిరేకులు" సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన టెలివిజన్ స్టార్ ఆర్కే సాగర్ హీరోగా నటించిన సినిమా ది 100. ఈ సినిమా జూలై 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం మెగాస్టార్ తల్లి అంజనాదేవిని కలిసి ఆశీర్వాదం తీసుకుంది.
వీడియోలో అంజనమ్మ చిరునవ్వుతో మాట్లాడుతూ, ఆర్కే సాగర్‌పై తనకున్న అభిమానం గురించి చెప్పారు. ఈవీడియోలో అంజనాదేవి మాట్లాడుతూ. “నాకు మొగలిరేకులు సీరియల్ నుంచి సాగర్ గుర్తుండిపోయాడు. మా నాన్నగారి పేరు కూడా ఆర్కే నాయుడు. అందుకే ఆర్కే అన్న పేరు నాకు దగ్గరైంది. సాగర్ చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. అతన్ని చూస్తుంటే నాన్నగారి జ్ఞాపకం వస్తుంది. నిజంగా సాగర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళాలి. అనవసరంగా సినిమా రంగంలోకి వచ్చావు,” అంటూ అంజనమ్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆమె మాటలకు స్పందించిన ఆర్కే సాగర్ నవ్వుతూ, “పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చి ఉంటే మిమ్మల్ని కలిసే అవకాశం రాకపోయేదేమో. అందుకే మిమ్మల్ని కలవడానికి సినిమా రంగానికొచ్చాను,” అని చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోను చూసి అంజనమ్మ ఆరోగ్యంగా ఉన్నారనే విషయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకుముందు ప్రచారంలో ఉన్న ఆరోగ్య సంబంధిత వార్తలకు పూర్తి స్థాయిలో ముగింపు పలికేలా ఈ వీడియో నిలిచింది. చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్యం మంచిగా ఉండటంతో మెగాఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
