మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. రీఎంట్రీలోనే బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిన చిరు.. తర్వాతి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైరా నరసింహా రెడ్డి అంటూ.. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే మూవీని చేస్తున్నారు చిరు. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ మూవీ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో నిర్మించిన సెట్స్ లో సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని.. రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా చెప్పారు. షూటింగ్ స్పాట్ నుంచి.. సినిమా అప్ డేట్స్ లీక్ కాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ ఎలా ఉండనున్నారనే లుక్ ఒకటి బయటకు వచ్చేసింది. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి పక్క బిల్డింగ్ మీద నుంచి తీసిన ఈ లుక్ లో.. నరసింహారెడ్డి పాత్రలో చిరు లుక్ ను లీక్ చేసేస్తోంది. 

ఈ ఫోటోలో ఉన్నది చిరంజీవే అని అర్ధమవుతున్నా.. మరీ అంత స్పష్టంగా లేకపోవడం ఒక్కటే సైరా టీంకు అనుకూలించే విషయం. అయితే.. టీజర్ పోస్టర్ లో చిరంజీవి లుక్ ను వెనుక నుంచి చూపించగా.. ఇప్పుడు ఈ లీక్డ్ పోస్టర్ లో మెగాస్టార్ పాత్ర రూపం ఎలా ఉండనుందనే సంగతి కొంతమేరకు తెలిసిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో సైరా లీక్డ్ లుక్ వైరల్ గా మారిపోయింది.