సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ జీఎస్టీ చిత్రం రూపొందించిన కేసులో.. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగానే ఈ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా రూపొందించారనే అభియోగాలపై వర్మపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా వర్మ వెల్లడించిన విషయాలు వాస్తవాలకు దూరంగా ఉన్నట్టు వెల్లడైనట్టు సమాచారం. ఈ విషయంలో వర్మ అరెస్ట్ ఖాయమనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనపై పెట్టిన కేసులు ఇవే..

 

జీఎస్టీ వివాదంలో రాంగోపాల్ వర్మపై పెట్టిన కేసుల్లో క్రిమినల్ ప్రొసిజర్ కోడ్, 1973 సెక్షన్ ప్రకారం.. దోషిగా తేలితే.. ఆరోపణలు రుజువైతే ఏ వ్యక్తినైనా వారెంట్ జారీ చేయకుండా అరెస్ట్ చేయవచ్చు. అక్రమంగా సమాచారం చేరవేత 41 సెక్షన్ ప్రకారం.. చట్టాలకు అతీతంగా ఏదైనా సమాచారాన్ని స్వీకరించినా.. లేదా బయటకు పంపినా నేరం చేసిన వారిగా పరిగణింపబడుతారు. ఈ సెక్షన్ చాలా తీవ్రమైనది. దాదాపు ఈ సెక్షన్ కింద కేసు నమోదైన వారు బయటపడిన దాఖలాలు లేవనే మాట పోలీసుల వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

 

జీఎస్టీ వివాదంలో రాంగోపాల్ వర్మపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 కింద మరో కేసు నమోదైంది. ఎలక్ట్రానిక్ రూపంలో ఏదైనా సమాచారాన్ని ప్రచురించినా.. ఇంటర్నెట్ ద్వారా విదేశాలకు చేరవేసినా లేదా అశ్లీల కంటెంట్‌ను వేరే ప్రాంతానికి చేరవేసినా వ్యక్తి శిక్షార్హులుగా పరిగణింపబడుతారు.

 

41 సెక్షన్, ఐటీ యాక్ట్ 2000 అనుగుణంగా రాంగోపాల్ వర్మ జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీని నిబంధనలకు విరుద్ధంగా స్వదేశంలోనే డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ నుంచే అప్‌లోడ్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే ఆయన అరెస్ట్ తప్పదేమో..

 

అశ్లీల పదజాలం, అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలపై రాంగోపాల్ వర్మపై నమోదైన మరో కేసు నమోదైంది. సామాజిక కార్యకర్తలు దేవీ, మణి చేసిన ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్ 506, 509 సెక్షన్ల కింద వర్మపై కేసు బుక్ చేశారు.

 

జీఎస్టీ విడుదలకు ముందు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తమకు సారీ చెప్పినా సహించబోమని సామాజిక కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ వివాదంలో వారి కేసు కూడా బలంగా ఉండే అవకాశం ఉంది.

అశ్లీల, అసభ్యకరమైన రీతిలో రూపొందించిన జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీని దేశంలో నిషేధించాలి. ఇంటర్నెట్ నుంచి దానిని తొలగించాలి అని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

సెన్సార్ బోర్డు నిబంధనలు తుంగలో తొక్కడమే లక్ష్యంగా జీఎస్టీని రాంగోపాల్ వర్మ రూపొందించారు. అశ్లీలంగా చిత్రీకరించేందుకు మహిళను ఓ వస్తువుగా ఉపయోగించాడు. అంతేకాకుండా పోర్నోగ్రఫి (అశ్లీల చిత్రాలను) ప్రమోట్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడనే సామాజిక కార్యకర్తలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.