మెగాస్టార్ 150వ సినిమాపై త్వరలో పుస్తకం ప్రి రిలీజ్ ఫంక్షన్ లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చిత్ర యూనిట్ సభ్యుల అనుభవాలతో పుస్తకం

సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న మెగాస్టార్ 150 వ సినిమా ఖైదీ నంబర్ 150. మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న.., మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటంతో ఖైదీ నంబర్ 150పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ విషయంలో కూడా చిత్రయూనిట్ చాలా పక్కాగా ప్లాన్ చేస్తోంది. ప్రతీ అంశంలో అభిమానులను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే టీజర్, మేకింగ్ వీడియోలతో ఆకట్టుకున్న ఖైదీ టీం, త్వరలో ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పుస్తకంలో ఖైదీ నంబర్ 150 సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలను ప్రచురిస్తారు. ఇప్పటికే ప్రింటింగ్ పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు మెగా టీం కృషి చేస్తోంది.

చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150, తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‑గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో డిసెంబర్ 25న మార్కెట్లోకి విడుదలవుతోంది.