శ్రీదేవి మరణం అనంతరం ఆమె భౌతికకాయం దుబాయ్ నుండి ఇండియా చేరే లోపల కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు. ఇంత జరిగినా కొన్ని మీడియా సంస్థల తీరు మారలేదు. ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు ఇలా ముగిసాయో లేదో.. అలా పలు సెన్సేషన్ కథనాలు వండి వడ్డిస్తున్నాయి బాలీవుడ్ మీడియా వెబ్ సైట్లు.

 

శ్రీదేవి అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేయనున్నారు. ఆమె భర్త బోనీకపూర్ ఇతర కుటుంబసభ్యులతో కలిసి ముంబై నుంచి చార్టర్డ్ విమానంలో శుక్రవారం రోజు రాత్రికి చెన్నై చేరుకోనున్నారు. అక్కడి నుంచి రామేశ్వరం వెళతారని సమాచారం.... అయితే ఈ లోపే బాలీవుడ్ మీడియాలో పలు సెన్సేషన్ కథనాలు వస్తున్నాయి.

 

శ్రీదేవి జీవితంపై వివాదాస్పద దర్శకుడు, శ్రీదేవి ఆరాధకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తీయబోతున్నారంటూ కథనాలు వండి వడ్డిస్తున్నాయి బాలీవుడ్ మీడియా సంస్థలు. ఇప్పటి వరకైతే వర్మ నుండి అలాంటి ప్రకటన రాలేదు. వర్మకు ఆ ఆలోచన ఉందో? లేదో? అనే విషయంలో క్లారిటీ లేదు. ఒక వేళ ఆయనకు ఆ ఉద్దేశ్యం ఉన్నా.. వర్మ కంటే ముందే మీడియా అత్యుత్సాహం ఏమిటి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

 

తాను ఎంతగానో ఆరాధించే శ్రీదేవి ఇక ఈ లోకంలో లేరనే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ సైతం జిర్ణించుకోలేక పోయారు. ఆ బాధతోనే తన ఆరాధ్య నటి, అతిలోక సుందరి జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో? అని తన తోటి శ్రీదేవి అభిమానులకు వివరిస్తూ పలు వివాదాస్పద విషయాలు ట్విట్టర్ ద్వారా బయట పెట్టిన సంగతి తెలిసిందే.

 

వర్మ తాను తీయబోయే శ్రీదేవి బయోపిక్‌లో పలు వివాదాస్పద అంశాలను చూపించబోతున్నారని, ముఖ్యంగా బోనీ కపూర్ పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా తయారైందని, ఎన్ని కష్టాలు పడింది అనే విషయాలు బయట పెట్టబోతున్నారంటూ... బాలీవుడ్ మీడియాలో సరికొత్త కథనాలు దర్శనమిస్తున్నాయి.

 

తాను ప్రకటన చేయక ముందే మీడియా శ్రీదేవి బయోపిక్ తీస్తున్నాడంటూ ప్రచారం చేయడంపై రామ్ గోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో మరి.