బాహుబలి సక్సెస్ పై స్పందించిన సల్మాన్ ఖాన్ బాహుబలి సక్సెస్ క్రెడిట్ అంతా హిందీ ప్రేక్షకులదేనంటున్న సల్మాన్ దక్షిణాదిలో హిందీ సినిమాలు ఆడకున్నా వాళ్ల సినిమాలు హిందీలో ఆడుతాయన్న సల్లూ భాయ్
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-2' హిందీ చిత్ర పరిశ్రమలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేవలం హిందీలోనే రూ. 500 కోట్లు వసూలు చేసి బాలీవుడ్లో అందరికీ షాకిచ్చింది. ఒక నాన్ హిందీ ఫిల్మ్ ఇక్కడి పెద్ద పెద్ద స్టార్ల సినిమాలను సైతం పడగొట్టి నెం.1 స్థానంలో నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఏదైనా రికార్డులు బద్దలు కొట్టాలంటే.... అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లకు మాత్రమే సాధ్యమయ్యేది. ఇపుడు ప్రభాస్ సౌత్ నుంచి వచ్చి బాలీవుడ్ బాక్సాఫీను షేక్ చేయడం హాట్ టాపిక్ అయింది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 'బాహుబలి-2' సినిమా గురించి, సౌత్ ఫ్యాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక బాలీవుడ్ మూవీ అంత పెద్ద నెంబర్స్ సాధించడం కష్టం. బాహుబలి సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి కారణం హిందీ ప్రేక్షకులు. వారు బాహుబలి సినిమాను స్వీకరించారు. కానీ.. దక్షిణాది ప్రేక్షకులు మమ్మల్ని స్వీకరించడం లేదు అని సల్మాన్ ఖాన్ తెలిపారు. హిందీ ప్రేక్షకులకు తెలుగు సినిమా స్టార్లు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ పెద్దగా తెలియదు. ముక్కు మొహం తెలియని ప్రభాస్ లాంటి హీరో సినిమాను కూడా బాగా ఆదరించారు. దక్షిణాది ప్రేక్షకులకు మేము బాగా తెలుసు. కానీ మా సినిమాలు అక్కడ సరిగా ఆడవు. సౌత్ ప్రేక్షకులు వారి వారి హీరోల సినిమాలను తప్ప ఇతర స్టార్ల సినిమాలను పెద్దగా ఆదరించక పోవడమే కారణం అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.
సౌత్‌లో ఆయా స్టార్లకు చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక వేళ వారు కమల్ హాసన్ ఫ్యాన్స్ అయితే వారు ఎప్పటికీ కమల్ హాసన్ అభిమానిగానే ఉంటారు, రజనీకాంత్ అభిమాని అయితే జీవితాంతం రజనీకాంత్ అభిమానిగానే ఉంటారు.. అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.
బాహుబలిని ఈ స్థాయిలో ఆదరించినందుకు నేను హిందీ ప్రేక్షకులకు హాట్సాఫ్ చెబుతున్నాను. వారు సినిమాను ప్రేమిస్తారు. ఇంగ్లిష్, చైనీస్, సౌత్ ఫిల్మ్స్ ఇలా అన్నింటినీ ఆదరిస్తారు అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ సల్మాన్ ఖాన్ అభిమాని షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలు కూడా చూస్తారు.... సినిమా నచ్చితే అభినందిస్తారు' అన్నాడు సల్మాన్.
