బిగ్ బాస్2 లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా దూసుకుపోతున్న తేజస్వి హౌస్ లో ఏం చేస్తున్నా.. ఆమెను ఎవరు ప్రశ్నించకూడదనే ధోరణిలో వ్యవహరిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో ఆమె ప్రవర్తన మితిమీరిందనే చెప్పాలి. రెండు వారాలు ఆలస్యంగా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నందిని రాగానే తేజస్వితో హౌస్ లో తనకు భాను అంటే అసలు నచ్చదని ఆమెపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది.

కానీ భాను ప్రవర్తన మంచిగా అనిపించడంతో ఆమెతో కలిసిపోయింది నందిని. ఇది చూసి భరించలేని తేజస్వి.. నందిని ఆరంభంలో భాను గురించి చెప్పిన మాటలు భానుకి చెప్పి ఇద్దరి మధ్య గొడవకు తెరలేపింది.నందిని స్వయంగా వెళ్లి భానుని క్షమించమని కోరడంతో ఇష్యూ ముగిసిపోయిందనుకున్న తరుణంలో తేజస్వి ఎంట్రీ ఇచ్చి గొడవను మరింత ఎక్కువ చేసింది. నందిని.. తనీష్ ను కూడా ఏవో మాటలు అందని చెప్పి మళ్లీ వారిద్దరి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేసింది. దీంతో నందిని అక్కడ నుండి వెళ్లిపోయి తన బాధను దీప్తి, శ్యామలకు చెప్పుకుంటూ బోరున ఏడ్చింది.

నందిని ఏడుస్తున్నా పట్టించుకోని తేజస్వి ఆమెపై కామెంట్లు చేస్తూ వెటకారపు నవ్వులు నవ్వింది. ఆమె ప్రవర్తన నందినిని మాత్రమే కాదు చూసే ఆడియన్స్ కు కూడా పెద్దగా నచ్చలేదు. ఇదంతా గమనించిన తనీష్ కు తేజస్వి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చింది. అదే విషయాన్ని సామ్రాట్ తో చర్చించాడు. ఈ విషయం తేజస్వికి తెలిసి తనీష్ పై కూడా విరుచుకుపడింది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు తప్పులు చేస్తోన్న వారిని నేరుగా ప్రశ్నిస్తోన్న నాని.. తేజస్విని మాత్రం ఏం అనకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కనీసం ఈ వారమైనా తేజస్వి ప్రవర్తన పట్ల నాని ఏమైనా కామెంట్ చేస్తాడేమో చూడాలి!