బిగ్ బాస్ సీజన్ 2 పై ప్రేక్షకుల్లో రోజురోజుకి ఆసక్తి పెరిగిపోతుంది. దానికి తగ్గట్లే గేమ్ లో టాస్క్ లను కూడా డిజైన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఎన్నడూ లేని విధంగా ఈవారంలో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్ లను హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేలా చేశారు. నిజానికి ముందుగా ఒకరితో రీఎంట్రీ ఇప్పించాలని అనుకున్నా.. ఊహించని విధంగా శ్యామల, నూతన్ నాయుడు ఇద్దరికీ ఓట్లు సమానంగా రావడంతో ఇద్దరికీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు.

అయితే నూతన్ నాయుడు హౌస్ లోకి వెళ్లడం వెనుక పెద్ద స్కామ్ ఉందని తేల్చేసింది సంజన. సామాన్యురాలిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సంజన మొదటివారంలోనే బయటకు వచ్చేసింది. రీఎంట్రీకి ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కాంపెయిన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆమె నూతన్ నాయుడుపై సంచలన కామెంట్స్ చేసింది. ''నూతన్ నాయుడు ఫోన్ చేసి నాకు ఫోన్ నేను 100% వెళ్తున్నాను అని చెప్పారు. డబ్బులిచ్చి పబ్లిసిటీ చేయించుకుంటున్నారంటే ఎవరూ నమ్మడం లేదు. అందుకే ఈ రికార్డింగ్స్ వినిపిస్తున్నాను'' అంటూ కొన్ని ప్లే చేసింది.

అందులో నూతన్ నాయుడు ఒక యూట్యూబ్ ఛానెల్ కు ప్రమోషన్స్ కోసం రూ.18800 ఒకసారి అలానే రూ.25000 మరోసారి ఇచ్చినట్లు వెల్లడించారు. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటున్నారనే విషయం ప్రజలకు తెలియజెప్పడం కోసమే ఈ వీడియో ప్లే వినిపించినట్లు సంజన వెల్లడించారు. అంతేకాదు ఓట్ల విషయంలో చాలా రాజకీయాలు జరిగాయని ఆమె అన్నారు. ఈ విషయం చెబుతున్నందుకు తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దని వెల్లడించారు.