బిగ్ బాస్2 నాలుగో వారం ఎలిమినేషన్ లో యాంకర్ శ్యామల బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇంటి నుండి వెళ్లేప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యారు శ్యామల. అసలు ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని అన్నారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఎలిమినేషన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

''నేను ఎలిమినేట్ అయిన తరువాత చాలా మంది జస్టిస్ ఫర్ శ్యామల అంటూ సోషల్ మీడియాలోపోస్ట్ లు పెడుతున్నారు. వారి అభిమానానికి రుణపడి ఉంటాను. నిజానికి ఎలిమినేషన్ లో ఉన్న నాకు, దీప్తికి, నందినికి ఓట్లు ఒకే విధంగా వచ్చి ఉంటాయి. అందుకే కౌశల్, తేజస్విల దగ్గరున్న సేవ్ చేసే ఛాన్స్ ను వినియోగించారు. కౌశల్ తెలివిగా నందిని పేరు చెప్పేశాడు. ఇక నన్ను, దీప్తి మా ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం తేజస్వికి కూడా కష్టం అయింది. దీప్తి ఉండడం వలన తేజుకి పెద్ద సమస్య ఉండదు. నాకు నొప్పి పుడితే నేను చెబుతాను కానీ దీప్తి చెప్పదు. అక్కడ మన పక్కన ఎవరు ఉంటే మనకు సమస్య ఉండదో వాళ్లనే సెలెక్ట్ చేసుకోవడం గేమ్. ఇక్కడ తేజు నన్ను ఎలిమినేట్ చేసి గేమ్ ఆడింది.

ఇక షో నాకు రోలర్ కోస్టర్ రైడ్ లా అనిపించింది. ఇక ఈ వారంలో దీప్తి నామినేట్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇంట్లో నుండి వచ్చినప్పటి పరిస్థితులను బట్టి చెబుతున్నాను. బాబు గోగినేని, దీప్తి సునయన, కౌశల్, గీతామాధురి వీరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. షోలో నాకు సెక్యురిటీ గార్డ్ టాస్క్ నాకు బాగా నచ్చింది'' అని చెప్పుకొచ్చింది.

ఇక హౌస్ లో తేజస్వి, సామ్రాట్ ల మధ్య ఏం జరుగుతుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ''అది బిగ్ బాస్ స్క్రిప్ట్ కాదు.. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనే స్ట్రాటజీతో కూడా వారిద్దరూ అలా చేయడం లేదు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక మనిషి మీద ఒక రకమైన ఫీలింగ్ రావడంలో తప్పేముంది'' అంటూ వారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. మీరు మీలాగా ఉంటే డెఫినిట్ గా గెలుస్తారు అలా అని గెలుపు మీ చేతుల్లో ఉండదని.. అదృష్టం కూడా ఉండాలని చెప్పింది. హోస్ట్ గా నాని యాంకరింగ్  తనకు చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుందని వెల్లడించింది.