సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల ఆధిపత్యం కామన్ గా వుంటుంది. హీరో డామినేటెడ్ ఇండస్ట్రీలో ఓ హిరోయిన్ వాళ్లకు తగ్గ రీతిలో దూసుకురావటం అసాధారణం. అలాంటి కోవలో ఈ తరంలో కనిపించే అతితక్కువ మంది తారల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు అనుష్క శెట్టి. ప్రస్తుతం అనుష్క నటించిన 'భాగమతి' చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

 

భాగమతి చిత్రం జనవరి 26న విడుదలైన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 25 కోట్ల మార్కును అందుకుంది. తెలుగు సినిమాల విషయంలో తొలి రోజు రూ. 10 కోట్లు వసూలు చేయడం అంటే ఓ రేంజి స్టార్ హీరోకే సాధ్యం. అయితే అనుష్క నటించిన ‘భాగమతి' చిత్రం తొలి రోజు రూ. 12 కోట్లు వసూలు చేయడంతో ట్రేడ్ వర్గాలు పరేషాన్ అవుతున్నాయి

 

అమెరికా లాంటి దేశాల్లో క్రేజ్ సంపాదించుకోవడం అంటే అంత సులభం కాదు. ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికే అక్కడి మార్కెట్‌ను క్యాచ్ చేయడం సాధ్యం కాలేదు. కానీ చాలా మంది స్టార్ హీరోలకు సాధ్యం కాని క్రేజ్ అనుష్క సొంతం చేసుకుంది. అమెరికాలో ‘భాగమతి' చిత్రం తొలి రోజున 1,56,538 డాలర్లను వసూలు చేసింది. ప్రస్తుతం అమెరికాలో పోటీలో ఇతర సినమాలు ఏమీ లేక పోవడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో ఈచిత్రం 1 మిలియన్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు

 

ఈ చిత్రంలో భాగమతిగా, కలెక్టర్ చంచలగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను అనుష్క పోషించింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్, హారర్ మిక్స్ చేసి దర్శకుడు అశోక్ సినిమాను బాగా తీశాడు. యూవి క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమాలో  కనిపిస్తాయి. సినిమా మొత్తం అదిరిపోయేలా వుండటంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.