జయలలిత వారసత్వంపై తొలగని ప్రతిష్టంభన తమిళనాట రాజకీయాలను మించి సాగుతున్న వారసత్వ డ్రామా వారసురాలిని నేనే అంటూ తెరపైకి మరో యువతి
తమిళనాట అమ్మ మరణం తర్వాత రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయం ఒకవైపు సాగుతుంటే... మరోవైపు అమ్మ వారసత్వంపై రోజుకో వివాదానికి తెరలేస్తోంది. అమ్మ ఆస్తికి వారసత్వం నాదంటే నాదని ఇంకా కొట్లాటలు కొనసాగుతునే వున్నాయి. మిస్టరీగా మారిన జయ మరణం ఆమె చనిపోయి ఇన్నాళ్లయినా రోజుికో మిస్టరీని ముందుకు తెస్తూనే వుంది. ఇప్పటికే వారసత్వం కోసం తండ్లాడుతున్న జయ బంధువులకు తాజాగా అమృత అనే బెంగళూరు యువతి రూపంలో మరో వారసురాలు తెరపైకి వచ్చి సవాల్ విసురుతోంది.
గతంలోనూ జయలలిత కొడుకు అంటూ ఒక వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. జయమరణానంతరం అతడు కోర్టులో ఆ మేరకు పిటిషన్ వేశాడు. తను జయ, శోభన్‌బాబులకు పుట్టాను అని అతడు వాదించాడు. అయితే అతడు సమర్పించిన ఆధారాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్థం లేని ఆధారాలను చూపించి.. కోర్టు సమయాన్ని వ్యర్థం చేసినందుకు అతడిని న్యాయస్థానం దండించి పంపించింది.
మరి ఆ విషయం మరవక ముందే ఇప్పుడు తను జయలలిత కూతురిని అంటూ ఒకామె ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్రపతి కోవింద్ లకు లేఖ రాసింది. బెంగళూరుకు చెందిన అమృత, తను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురు అని, జయ-శోభన్ బాబుల ప్రేమకు ప్రతిఫలంగా తను పుట్టాను అని వాదిస్తోంది.
జయలలిత, శోభన్ బాబులు ప్రేమించుకున్నారని, అయితే సమాజం కట్టుబాట్లకు భయపడి పెళ్లి చేసుకోలేదని.. ఆ సమయంలో పుట్టిన తనను జయలలిత, సోదరి శైలజకు అప్పగించిందని అమృత అంటోంది. ఇలా తన జీవితం అంతా రహస్యంగా సాగిపోయిందని.. జయలలితకు తనే అసలైన వారసురాలిని అని ఈమె అంటోంది.
ఈ విషయంలో నిజానిజాలు రాబట్టాలని.. అమృత ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి లకు లేఖలు రాయడం గమనార్హం. కావాలంటే డీఎన్ఏ టెస్టును చేసుకోవచ్చని.. తను జయలలిత కూతురిని అని నిర్ధారణ అవుతుందని ఈమె వాదిస్తోంది. తను ఒకసారి జయను కలిశానని, అప్పుడు ఆమె ఆప్యాయంగా పలకరించిందని అమృత చెప్పుకొచ్చింది.
మరో వైపు జయలలిత చావుకి శశికళ, నటరాజన్ లే కారణమనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది అమృత. మొత్తంమీద వివాదాస్పదంగా మారిన అమ్మ జీవితం వెనుక ఇంకెంత మిస్టరీ దాగుందో, ఏమేం బయటపడతాయో చూడాలి.
