నందమూరి నటసింహం బాలకృష్ణపై నెటిజన్ల సెటైర్ల పర్వం అస్సలు ఆగట్లేదు. బాలయ్య హావ భావాలు, పంచ్ డైలాగులపై గతంలో సెటైర్ల వర్షం కురిపించిన నెటిజన్లు 'జైసింహా' సినిమా రిలీజ్ తర్వాత కూడా సెటైర్ల పర్వం కొనసాగిస్తున్నారు. తన సినిమాల్లో ప్రేక్షకుల ఊహకందని బాలయ్య స్టంట్లు, విన్యాసాలు ఆయన అభిమానులతో చప్పట్లు కొట్టించినా.. సాధారణ ప్రేక్షకుడిని మాత్రం కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

 

బాలయ్య అంటేనే డైలాగులు, చిటికెన వేలుతో చితగ్గొట్టే ఫైట్లు, అరచేత్తో నడిచే రైలు బండిని ఆపే స్టంట్స్. ఇలాంటి ఇమేజ్ వున్న బాలయ్య హీరో ఇమేజ్ ను మరింత పెంచేందుకు దర్శకులు చేసే కొత్త కొత్త ప్రయోగాలు అప్పుడప్పుడు బెడిసికొడుతున్నాయి. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన బాలయ్య సింప్లిసిటీకి ఎప్పుడో దూరమయ్యారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి నెటిజన్ల పోకిరి కామెంట్స్ కు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త శృతి కలపడంతో జైసింహా సినిమాలో బాలయ్య చేసిన ఓ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఓ చిన్నపిల్లాడి పాల సీసా కోసం పోలీసులను ఎదిరించే సందర్భంలో బాలయ్య  సదరు పోలీసులు వాడే బొలేరో వాహనాన్ని ఒంటి చేత్తో గాల్లోకి ఎత్తే సన్నివేశాన్ని ట్వీట్ చేసిన విష్ణు చైతన్య అనే నెటిజన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద మహేంద్రకు ఆ ట్వీట్ పంపారు. ఈ అద్భుత సన్నివేశాన్ని మిస్ కావద్దంటూ ట్వీట్ చేశాడు.

 

ఈ వీడియో చూసి ఆశ్చర్యానికి గురైన ఆనంద్ మహింద్రా తన ట్విట్టర్ ఎకౌంట్ లో స్పందిస్తూ .... 'బొలేరో వాహనాలను చెక్ చేసేందుకు ఇకపై మహింద్రా సర్వీసు స్టేషన్లో హైడ్రాలిక్ లిఫ్ట్ వాడనక్కర్లేదు' అంటూ సరదాగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ విషయం తెలిసిన నెటిజన్లు బాలయ్యను ఆడేసుకుంటున్నారు.