బాలకృష్ణ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. తన బసవతారకం ఆసుపత్రి పేరుని వాడుకుని విరాళాలు వసూళు చేస్తుండగా, బాలయ్య అప్రమత్తమయ్యారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
KNOW
సెలబ్రిటీల పేరుతో అడపాదడపా మోసాలు జరుగుతూనే ఉంటుంటాయి. సినిమా స్టార్స్ పేరు చెప్పినప్పుడు జనాలు ఈజీగా నమ్ముతుంటారు. దీన్నే మోసగాళ్లు ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.
తాజాగా ఇది బాలకృష్ణకి ఎదురైంది. ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో మోసం జరిగింది.
ఈ పేరుని వాడుకొని ఓ వ్యక్తి జనాలనుంచి విరాళాలు వసూలు చేస్తుండటం గమనార్హం. ఈ విషయం బాలయ్య వద్దకు చేరింది. దీంతో ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేశారు.
మోసగాళ్లకి బాలయ్య వార్నింగ్
బాలకృష్ణ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, జరిగే మోసాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు బాలయ్య. ఇందులో ఆయన చెబుతూ, `ప్రజలకు హెచ్చరిక!
`బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్` పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సందర్భంగా ప్రజలందరికి నేను స్పష్టంగా తెలియజేయదలచుకున్న విషయం. ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎలాంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి —
దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు
కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు` అని తెలిపారు. ప్రజలను హెచ్చరిస్తూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు బాలయ్య.
`అఖండ 2`తో రాబోతున్న బాలయ్య
ఇక ప్రస్తుతం బాలయ్య టాలీవుడ్‌లో సీనియర్ హీరోల్లో టాప్‌లో ఉన్నవారిలో ఒకరు. వరుసగా నాలుగు వంద కోట్ల సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం ఆయన `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో ఆదిపినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే రిలీజ్ డేట్‌లో మార్పు ఉండబోతుందని సమాచారం.
