బాలయ్య హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజైన పైసా వసూల్ పైసా వసూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన యుఎస్ లో ఫుల్ రన్ లో 2.5 మిలియన్ డాలర్లు కూడా కష్టమేనంటున్న ట్రేడ్ వర్గాలు
నందమూరి బాలయ్య గట్టిగా తొడగొడితే... ఆ సౌండుకే శత్రువు చచ్చిపోయే జమానా ఒకటుండేది. ప్లేసు నువ్వుచెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే అంటూ బాలకృష్ణ కాలు దువ్వాడంటే.. విలన్ ప్యాంటు తడవాల్సిందే. ఇక ఇటీవల వచ్చిన శాతకర్ణి సినిమాలో కూడా.. సమయం లేదు మిత్రమా.. శరణమా రణమా... అంటూ భారీ డైలాగులతో కాసుల వర్షం కురిపించాడు బాలయ్య. అంతటి పెద్ద హీరో అయినప్పటికీ ఓవర్సీస్‌కు వచ్చేసరికి బాలకృష్ణ చాలా వీక్. నాని లాంటి యంగ్ హీరోలకు కూడా అక్కడ తిరుగులేని మార్కెట్ ఉండగా.. బాలయ్య సినిమాల పరిస్థితి మాత్రం దారుణం. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ముందు వరకు బాలయ్యకు అర మిలియన్ డాలర్ల సినిమా కూడా లేదు అమెరికాలో.
ఈ సినిమాకు ముందు వచ్చిన ‘డిక్టేటర్’ను భారీ ఎత్తున రిలీజ్ చేసి అక్కడి బయ్యర్ దెబ్బతిన్నాడు. ఓవర్సీస్ ప్రేక్షకులు ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, లవ్ స్టోరీల్నే ఇష్టపడతారు. బాలయ్య మాస్ సినిమాలు వాళ్లకు పట్టవు. భారీ డైలాగులకు థియేటర్ కు వచ్చేందుకు భయపడుతుంటారు.
ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో కథ మారింది. బాలయ్య సినిమాను కూడా అక్కడి జనాలు బాగానే ఆదరించారు. బాలయ్యకు ఇది తొలి మిలియన్ డాలర్ మూవీ అయింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 1.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఈ సినిమాతో బాలయ్యపై అక్కడి జనాలకు కొంచెం గురి కుదిరింది. మంచి మార్కెట్ ఏర్పడింది యుఎస్‌లో. ఐతే ఆ మార్కెట్ మొత్తాన్ని ‘పైసా వసూల్’ ధ్వంసం చేసేసింది. ‘శాతకర్ణి’తో కొత్తదనం పంచిన బాలయ్య.. ఈసారి అదే రొటీన్ మాస్ మసాలా మూవీతో రావడంతో అక్కడి జనాలు తిప్పికొట్టారు.
ప్రిమియర్స్‌తోనే సినిమాకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. మామూలుగా కొత్త సినిమాలకు అత్యధిక వసూళ్లుండే తొలి శనివారం రోజు ఈ సినిమా కేవలం 27 వేల డాలర్లు వసూలు చేసింది. ఇప్పటిదాకా ఈ చిత్రం 2 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఫుల్ రన్లో 2.5 లక్షల డాలర్ల మార్కును కూడా అందుకోవడం కష్టంగానే ఉంది. మొత్తానికి బాలయ్య ‘శాతకర్ణి’తో సాధించుకున్న పేరు, మార్కెట్ అంతా ‘పైసా వసూల్’తో పోయిందని చెప్పాలి.
