వెరైటీ కథాంశాలతో తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తారు క్రిష్. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత... ప్రస్థుతం మణికర్ణిక చిత్రం చేస్తున్నారాయన. ఇక క్రిష్ దర్శకత్వంలో  తదుపరి 'అహం బ్రహ్మాస్మి'అనే సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా బాలకృష్ణ నటించనున్నారనీ .. ఆయనని క్రిష్ ఒప్పించడం జరిగిపోయిందని అంటున్నారు.

 


 'మణికర్ణిక' తరువాత క్రిష్ .. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ చేసే సినిమా ఇదేనని చెబుతున్నారు. గతంలో బాలకృష్ణ .. క్రిష్ కాంబినేషన్లో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వచ్చింది. చారిత్రక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ కాంబినేషన్లో 'అహం బ్రహ్మాస్మి' రూపొందనుందనేది బాలయ్య అభిమానులకు శుభవార్తే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.