సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బాహుబలి 2 ది కన్ క్లూజన్ రివ్యూ

ప్రేమలో పడితే కుట్రలు ఎదురవుతాయి...

గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. అయితే ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. దీంతో ఆమెపై ప్రేమను వదులుకోలేక ఆమెతోనే అడవిలో గడుపుతుంటాడు బాహుబలి. తొలుత భల్లాల దేవుడు బాహుబలిని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపోస్తాడు. తద్వారా రాజ్యపెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడినుంచీ బాహుబలిని అడ్డు తొలగించుకోవడానికి కుట్రలు పన్నుతుంటాడు.

బాహుబలిని నేరుగా ఎదుర్కోలేక పన్నే కుట్రల్లో భాగంగా భల్లాల దేవుడు తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ బాహుబలి నేతృత్వం వహిస్తున్న ఆటవికసైన్యం చేస్తోందనీ చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈ లోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టటం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయనీ, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారనీ చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. భల్లాల దేవుని కోరిక కూడా అదే. సైన్యంతో బయలు దేరుతాడు.

బాహుబలి అంతమొందించాలని శివగామి ఆదేశం

కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాలదేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురువెళతారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాలదేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓ వైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్తసంబంధం కన్నా రాజ్యమే గొప్పదనీ, బాహుబలిని బంధించి, లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనీ ఆజ్ఞాపిస్తుంది.

తల్లి ఆదేశించింది... కట్టప్ప పాటించాడు..

రాజమాత శివగామి ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు కట్టప్ప. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు.

భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలు దేరుతుంది. భల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెపుతుంది. రాజమాత పశ్చాత్తాప పడుతుంది.

శత్రుశేషం ఉండకూడదని..

ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రీ అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కిందివరకూ వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు. దాంతో భల్లాల దేవుడు దేవసేనను బంధించి, కట్టప్పను విశ్వాస బంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు.

మిగతా కథ ఊహించదగ్గదే...అదే క్లైమాక్స్

అయితే పెరిగి పెద్దయిన రెండో బాహుబలి తన తండ్రి రాజ్య సింహాసనాన్ని ఎలా అధిష్టిస్తాడు. భల్లాల దేవుని ఎలా ఓడిస్తాడు. రాజమాత శివగామి దేవి ఆత్మకు ఎలా శాంతి చేకూరుస్తారు. అన్నదే మిగతా కథ.

ఇది కేవలం సోషల్ మీడియా రివ్యూ మాత్రమే. ఈ కథ ఎంత మేరకు నిజమో, కాదో తెలియదు కానీ.. ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఆటవిడుపు కోసం ఏసియానెట్ పాఠకులకు అందించడం జరిగింది.

ఈ స్టోరి, రివ్యూ సోషల్ మీడియాలో వచ్చింది మాత్రమే. గమనించ గలరని ప్రార్థన.