బాహుబలి1, బాహుబలి2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమాల చిత్రీకరణ సమయంలో బహుబలికి ప్రీక్వెల్ ఉంటుందనే వార్తలు వినిపించాయి. బాహుబలి పార్ట్ 1కి ముందు జరిగిన సన్నివేశాలతో ప్రీక్వెల్ ను సిద్ధం చేయనున్నారు. అయితే ఇది సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా రూపొందించనున్నారు. 

ప్రీక్వెల్ మొత్తం శివగామి శకంగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు రూ.375 కోట్ల బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నారు. వెబ్ సిరీస్ కు ఈ రేంజ్ లో ఖర్చు ఏంటి అనుకుంటున్నారా..? క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా మూడు సీజన్లలో ఏ ప్రీక్వెల్ ను తీయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి చాలా రోజులుగా ఈ ప్రీక్వెల్ టాపిక్ మీడియాలో నలుగుతున్నా.. ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చినట్లుంది. డైరెక్టర్ కూడా దొరకడంతో ఇక వెబ్ సిరీస్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు దేవ్ కట్టా ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.

రాజమౌళి దర్శకత్వపర్యవేక్షలో ఈ సిరీస్ రూపొందనుంది. దీనికి 'శివగామి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని విస్తరించడంలో శివగామి రోల్ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ కోసం ఆడిషన్స్ జరుపుతున్నారు. అలానే దేవ్ కట్టా హిందీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. అది ఓ కొలిక్కి వచ్చిన తరువాత ఈ వెబ్ సిరీస్ ను మొదలుపెట్టనున్నాడు.