తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి చేర్చిన బాహుబలి2 చిత్రం రూ. 1000 కోట్లు వసూలు సాధించేసింది. ఇక న భూతో న భవిష్యతి అన్న తీరుగా సరికొత్త టార్గెట్ వైపు దూసకెళ్తోంది. బాహుబలి సినిమా వెయ్యు కోట్ల మార్క్ ను రీచ్ అవ్వడం ద్వారా... భారతీయ చలన చిత్ర రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది.

 

రూ. 1000 కోట్ల మార్కును అందుకున్న విషయాన్ని బాహుబలి టీం కూడా సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ప్రకటించింది. బాహుబలి2 రూ. 1000 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు అఫీషియల్ గా ప్రకటించిన చిత్ర యూనిట్.. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం అందించి తమకు అండగా నిలిచిన ప్రేక్షకలకు, ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పారు.

 

ఇక ఈ సంతోష సమయంలో బాహుబలి స్టార్ ప్రభాస్ ఎమోషనల్‌గా స్పందించారు. 'నా ఫ్యాన్స్‌ అందరికీ...బిగ్ హగ్. నాపై మీరు చూపించిన  ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. భారత్‌లో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ప్రేక్షకుల ఆదరణ పొందడానికి నా శక్తిమేర ప్రయత్నం చేశాను. మీరు నాపై చూపించిన ఆదరణకు సంతోషంతో పొంగిపోతున్నానని ప్రభాస్ అన్నారు. బాహుబలి చిత్రం ఓ సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరంతా నాతో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.... అని ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశారు. బాహుబలి జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి ఈ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన ఎస్‌.ఎస్‌ రాజమౌళికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అని ప్రభాస్ అన్నారు.