బాహుబలి సినిమాతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ దేశమంతా ప్రభాస్ కు అభిమానులుండటంతో సాహోకు యమా క్రేజ్ 150 కోట్ల సాహో చిత్రానికి 400 కోట్లు ఆఫర్ చేసిన బాలీవుడ్ ఈరోస్ సంస్థ
'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు కూడా ప్రభాస్ వెంట పడుతున్నాయంటే.. బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్ కు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ మార్కెట్లలో డిమాండ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయినా బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్.. ఆ మాత్రం ఇమేజ్ తెచ్చి పెట్టకుండా ఎలా ఉంటుంది.
అందుకే ఇపుడు ప్రభాస్ సినిమా అనగానే ఈరోస్ లాంటి పెద్ద సినీ నిర్మాణ సంస్థలు వందల కోట్లు గుమ్మరించడానికి సిద్ధపడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమాను దక్కించుకునేందుకు ఈరోస్ సంస్థ రూ. 400 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాహో చిత్ర నిర్మాణ సంస్థ యూవి ప్రొడక్షన్స్ కూడా ఈ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసినట్లు సమాచారం.
ప్రభాస్ నటించిన బాహుబలి-2 చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 1500 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో..... ‘సాహో' సినిమాపై అంచనాలు పెరిగాయి. బాహుబలి రేంజిలో కాక పోయినా కనీసం రూ. 500 కోట్లయినా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ సినిమా స్టామినాను ముందే ఊహించిన ఈరోస్ సంస్థ... తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్ని బాషలకు కలిపి రూ. 400 కోట్ల ఆఫర్ తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘సాహో' టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. బాహుబలి-2 సినిమాతో పాటు ఈ టీజర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా బాగా పెరిగింది. యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్లో కలిపి ఈ టీజర్ కు కోటిన్నరకు పైగా హిట్స్ వచ్చాయంటే సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' తెరకెక్కుతోంది, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూ. 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ హంగులతో నిర్మిస్తున్న సాహో చిత్రానికి శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాదీ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో కీలక సన్నివేశమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.35 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించేందుకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్‌ను రంగంలోకి దించారు. ఈ యాక్షన్ సీన్ల చిత్రీకరణ కోసం యూరప్‌లోని కొన్ని ప్రదేశాలను, అబుదాబీలోని కొన్ని లోకేషన్లలో తెరకెక్కిస్తున్నారు.

