Ugly Story OTT: నటి అవికా గోర్ నటించిన 'అగ్లీ స్టోరీ' సినిమా థియేటర్లలో రిలీజైన కేవలం 14 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. శ్రీ నందు హీరోగా నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ 'ఆహా' ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుంది.
ఓటీటీలోకి అగ్లీ స్టోరీ ,
ఒకప్పుడు సినిమా రిలీజ్ అయితే నెలల తరబడి థియేటర్లలో ఆడేది. ఆ తర్వాత నెమ్మదిగా ఓటీటీలోకి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలే నెల తిరిగేలోపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేస్తుంటే, ఇక చిన్న బడ్జెట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు పోటీ పడి మరీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరింది హీరోయిన్ అవికా గోర్ నటించిన ఇంటెన్స్ మూవీ 'అగ్లీ స్టోరీ'. సాధారణంగా థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత సినిమాలు ఓటీటీలో కనిపిస్తాయి. కానీ, ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు సినిమా మాత్రం రికార్డు వేగంతో ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది.
14 రోజులకే డిజిటల్ ధమాకా!
గత మే 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రిలీజైన కేవలం 14 రోజులకే, అంటే జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ స్పీడ్ చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ మధ్యే లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' 12 రోజులకే రాగా, ఇప్పుడు అవికా సినిమా వంతు వచ్చింది.
`ఏంటీ 'అగ్లీ' స్టోరీ?
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా మనిషిగా మారిన అవికా గోర్, ఈ సినిమాలో చాలా విభిన్నమైన, సవాలుతో కూడిన పాత్రలో కనిపించారు. టైటిల్‌కు తగ్గట్టే ఇందులో అన్నీ అందంగా ఉండవు. "ప్రతి ప్రేమకథ అందంగా ఉండదు" అనే కఠిన నిజాన్ని ఈ సినిమా చూపిస్తుంది. కథ విషయానికొస్తే, నేహా (అవికా గోర్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి బాబాయ్ ఇంట్లో పెరుగుతుంది. ఆమె కజిన్ కార్తీక్, ఆమెపై పిచ్చి ప్రేమ, కానీ నేహా మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ను ప్రేమించి, అతనితో జీవితాన్ని పంచుకోవాలని కలలు కంటుంది. కానీ విధి, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా ఆమె కార్తీక్‌నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా నరకంగా మారుతుంది, కార్తీక్ హింస, కంట్రోల్ నుంచి ఆమె ఎలా బయటపడుతుంది అనేదే ఈ సినిమా కథ.
తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్
ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా, తమిళంలోకి కూడా డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ నందు హీరోగా నటించగా, శివాజీ రాజా, రవితేజ మహాదాస్యం కీలక పాత్రలు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఈ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాను మిస్ అయిన వారికి ఇది నిజంగా మంచి అవకాశం. వీకెండ్‌లో ఇంట్లో కూర్చుని చూసేందుకు ఒక సస్పెన్స్, ఎమోషనల్ సినిమా రెడీగా ఉంది.


