సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న అర్జున్ రెడ్డి మూవీ సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం తాజాగా తన కథను కాపీ చేశారంటూ నోటీసులు పంపిన ఇక సె..లవ్ దర్శకుడు

సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా థియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఓ వైపు అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్, ట్రెండ్ సెట్టర్ అనే కాంప్లిమెంట్స్ అందుకుంటుంటే... మరో వైపు ఈ సినిమా యువతను చెడగొడుతోందని, బూతులున్నాయని, సినిమాను నిలిపి వేయాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా బాక్సాఫీసు వద్ద సూపర్ కలెక్షన్లు సాధిస్తున్న అర్జున్ రెడ్డి కాపీ రైట్ వివాదంలో చిక్కుకుంది.

ఈ చిత్ర కథ తనదేనంటూ ఖమ్మంకు చెందిన దర్శకుడు డి.నాగరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు. తనకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డి.నాగరాజు అనే దర్శకుడు గతంలో 'ఇక సె..లవ్' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఆధారంగానే ‘అర్జున్ రెడ్డి' సినిమా తీశారని ఆయన ఆరోపిస్తున్నారు.

తన కథను వాడుకున్నందుకుగాను తనకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని, పరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలని నాగరాజు డిమాండ్ చేస్తున్నారు. ఈ కథ కాపీ కొట్టిన విషయమై ఇప్పటికే దర్శక నిర్మాతలకు తాను నోటీసులు పంపానని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని డి. నాగరాజు స్పష్టం చేశారు.

అయితే ‘అర్జున్ రెడ్డి' సినిమా దర్శకుడు మాత్రం ఈ సినిమా కథను తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తయారుచేసుకున్నానని ముందు నుండీ చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఈ కాపీ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.