Asianet News TeluguAsianet News Telugu

AP Ticket Prices: కొడాలి నాని ఎవరో తెలియదు... వర్మ కౌంటర్

కొడాలి వ్యాఖ్యలపై స్పందించాలని రామ్ గోపాల్ వర్మను నెటిజెన్స్ కోరుతున్న నేపథ్యంలో ఆయన మరో ట్వీట్ వేశారు. తన ట్వీట్ లో అసలు నాకు కొడాలి నాని ఎవరో తెలియదంటూ... కౌంటర్ వేశారు. 

ap tickets price issues ram gopal varma counter to minister kodali nani
Author
Hyderabad, First Published Jan 5, 2022, 3:25 PM IST

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)లో అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. స్వలాభమే ముఖ్యం పక్కనోడు ఎట్టబోతే నాకేంటి అనుకునే వర్మ... ఉద్యమ బాటపట్టారు. టికెట్స్ ధరలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరు సాగిస్తున్నారు. వరుస ట్వీట్స్, కామెంట్స్ తో ఏపీ ప్రభుత్వం (AP Government)పై దాడి చేస్తున్నారు. గత మూడు రోజులుగా వర్మ చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. టికెట్స్ ధరల తగ్గింపు ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్న వర్మ... తాడో పేడో తేలేదాక వదిలేలా లేడు. 

నిన్న వరుసగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని(Perni Nani)కి పది ప్రశ్నలు సంధించాడు. సినిమా టికెట్స్ ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, అది నిత్యావసర వస్తువుకు కాదని, పేద ప్రజలకు అంతగా తక్కువ ధరలకు వినోదం అందించాలనుకుంటే ప్రభుత్వం నిర్మాతల వద్ద టికెట్స్ కొన్ని పేదలకు పంచాలన్నారు. అలాగే రేషన్ షాపులు మాదిరి రేషన్ థియేటర్స్ ఓపెన్ చేసి వినోదం అందించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్మ ప్రశ్నలకు పేర్ని నాని సైతం ట్విట్టర్ ద్వారా సమాధానం చెప్పారు. 

Also read Naga Babu Supports Rgv : రామ్ గోపాల్ వర్మకు నాగబాబు సపోర్ట్..ఎం చెప్పారంటే..?

ఇక వర్మ కామెంట్స్ పై మంత్రి కొడాలి నాని సైతం స్పందించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ సినిమా టికెట్స్ (AP Ticket Prices)ధరల గురించి మాట్లాడే హక్కు వాళ్లకు లేదన్నారు. టికెట్స్ ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదనుకుంటే మాతో సంప్రదింపులు ఎందుకు? సినిమాలు తీసి వాళ్లకు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకోమనండి.. అంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఆగకుండా కామెంట్స్ చేయడం సరికాదన్నారు. 

Also read AP Tickets Prices: టికెట్స్ ధరల వివాదం... ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఉతికిపారేసిన వర్మ

ఇక కొడాలి వ్యాఖ్యలపై స్పందించాలని రామ్ గోపాల్ వర్మను నెటిజెన్స్ కోరుతున్న నేపథ్యంలో ఆయన మరో ట్వీట్ వేశారు. తన ట్వీట్ లో అసలు నాకు కొడాలి నాని ఎవరో తెలియదంటూ... కౌంటర్ వేశారు. నాకు నాచురల్ స్టార్ నాని తప్పితే కొడాలి నాని ఎవరో తెలియదని ట్వీట్ చేశారు. నానిపై కౌంటర్ వేస్తూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరోవైపు వర్మ పరిశ్రమలో అందరినీ కూడగడుతున్నారు. టికెట్స్ ధరల తగ్గింపుపై అందరూ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడూ మాట్లాడలేరని, ఆపై మీ ఖర్మ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు ఆర్జీవీ కి మద్దతుగా ట్వీట్ చేశారు. వర్మ వాదనలో నిజం ఉందని అతని వైపు నిలబడ్డాడు. 

వర్మ టికెట్స్ ధరల విషయం ఇంత సీరియస్ గా తీసుకుంటాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అందులోనూ ఈ వివాదం మూడు నెలలుగా నడుస్తుండగా... వర్మ సైలెంట్ గా ఉన్నారు. గత వారం రోజులుగా వర్మ టీవీ డిబేట్లలో పాల్గొంటూ, ట్వీట్స్ చేస్తూ, వీడియో బైట్స్ విడుదల చేస్తూ తన వ్యతిరేకత తీవ్రతరం చేశారు. వర్మ ఈ పోరాటం ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దగ్గర కావడం విశేషం. ఇప్పుడు సోషల్ మీడియాలో వర్మకు మద్దతు ప్రకటిస్తున్నవారిలో మెజారిటీ వర్గం పవన్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కావడం విశేషం. పవన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ సినిమాలు తీసే వర్మ అంటే ఫ్యాన్స్ కి మామూలు కోపం కాదు. అయితే తమ హీరో వ్యతిరేకించే వైసీపీ ప్రభుత్వంపై వర్మ పోరాటం చేయడంతో వారు వర్మ వైపుకు తిరిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios