Varma vs Perni Nani: వర్మ-పేర్ని నాని మధ్య కుదిరిన సంధి.. త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్స్
వర్మ లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు వరుసగా నాని ట్విట్టర్ లో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో వీరిద్దరి సోషల్ మీడియా వాదన ఆగిపోలేదు. ట్వీట్ కి ప్రతి ట్వీట్ తో ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు హై కోర్టులో లాయర్ల వలె వాదించుకున్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య టికెట్స్ ధరల విషయమై వాదన నడుస్తుంది. ట్విట్టర్ వేదికగా వీరిద్దరూ వాదనలు వినిపించుకుంటున్నారు. వర్మ టికెట్స్ ధరల తగ్గింపు నిర్ణయం సరికాదని అంటున్నారు. నిన్న ట్విట్టర్ లో పేర్ని నానికి వర్మ పది ప్రశ్నలు సంధించారు. సదరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రిని కోరారు. ఇక వర్మ కోరిన విధంగా నేడు పేర్ని నాని సమాధానాలు చెప్పారు. వర్మ లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు వరుసగా నాని ట్విట్టర్ లో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
దాంతో వీరిద్దరి సోషల్ మీడియా వాదన ఆగిపోలేదు. ట్వీట్ కి ప్రతి ట్వీట్ తో ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు హై కోర్టులో లాయర్ల వలె వాదించుకున్నారు. ఈ వాదనకు ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన వర్మ.. మంత్రి నాని(Perni Nani) తో సంధికి వచ్చారు. ఆయన సామరస్యపూర్వకంగా ఓ ట్వీట్ చేశారు. వర్మ..''పేర్ని నాని గారూ... ప్రభుత్వం తో గొడవ పెట్టుకోవాలి అన్నది మా ఉద్దేశం కాదు ..పర్సనల్ గా వై.ఎస్.జగన్ అంటే నాకు చాలా అభిమానం..కేవలం మా సమస్యలు మేము సరిగా చెప్పుకోలేక పోవడం వల్లో లేక , మీరు మా కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యల కి సంబంధించిన వివరణ ఇస్తాను.అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు.
ఇక వర్మ ట్వీట్ ని కోట్ చేసిన మంత్రి పేర్ని నాని... ''తప్పకుండా కలుద్దాం'' అంటూ ట్వీట్ తో సమాధానం చెప్పారు. దీంతో టాలీవుడ్ ప్రతినిధిగా వర్మ కొద్దిరోజుల్లో మంత్రి పేర్ని నానిని కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నుండి నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, సురేష్ బాబు ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ధరల విషయంలో పునరాలోచించాలని విన్నవించారు. అయితే ఎటువంటి పురోగతి జరగలేదు. మరి వర్మ ఈ విషయాన్ని సాల్వ్ చేయగలడా? ఆయన వాదన ఏపీ ప్రభుత్వ నిర్ణయంలో మార్పును తీసుకువస్తుందా? అనేది చూడాలి.
ఇక వర్మ-పేర్ని నాని మీటింగ్ కార్యరూపం దాల్చబోయే లోపు ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. పరిశ్రమ విమర్శలు దాడి చేసే కొలది ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించే అవకాశం కలదు. టికెట్స్ ధరల (AP Tickets Prices) నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. నివేదిక ఆధారంగా టికెట్స్ ధరలు పునరుద్ధరించే ఆస్కారం కలదు.
Also read AP Ticket Prices: కొడాలి నాని ఎవరో తెలియదు... వర్మ కౌంటర్
కాగా అనూహ్యంగా వర్మ టికెట్స్ ధరల సమస్యను తలకెత్తుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిశ్రమకు చెందిన వాడిగా ఈ విషయంపై స్పందించే హక్కు ఆయనకు ఉంది. ఎమోషన్స్, ఫీలింగ్స్ లేకుండా తన ప్రపంచంలో బ్రతికేసే వర్మ ఈ సమస్యపై పోరాడడం విడ్డూరం. కారణం ఆయన ఎవరి ప్రయోజనాల కోసం టైం కేటాయించరు. మరోవైపు వర్మకు ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరల వలన వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. ఆయన తెరకెక్కించే చిత్రాలు ఏవైనా దాదాపు తన ఓన్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లో విడుదల చేసుకుంటాడు. ఒకవేళ థియేటర్స్ లో విడుదల చేసినా ఆయన బడ్జెట్ కి ప్రస్తుతం ఉన్న ధరలు కూడా ఎక్కువే. వర్మ ఆలోచనలను అంచనా వేయడం కష్టం కాగా.. ఆయన పరిశ్రమ కోసం ఇంత సీరియస్ గా పోరాడడం ఇంకా చాలా మందికి నమ్మబుద్ధి కావడం లేదు.