బాహుబలి స్టార్స్ అనుష్క, ప్రభాస్‌ల స్నేహం గురించి తెలిసిందే. వీళ్ల క్లోజ్ నెస్ చూసిన వాళ్లంతా ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకుంటారనే పుకార్లతో సోషల్ మీడియాలో హోరెత్తించిన సంగతి తెలిసిందే.  అయితే, తమ మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేనని వీళ్లిద్దరూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రభాస్ అభిమానులు మాత్రం వీరిని జంటగా చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు.సాధారణంగా ప్రభాస్ కు ఇతర సినిమాల ప్రమోషన్స్ గానీ, ఇతర నటీనటులకు సంబంధించి గానీ సోషల్ మీడియాలో స్పందించే అలవాటు లేదు. ఫేస్‌బుక్‌లో తక్కువగా స్పందించే ప్రభాస్.. కేవలం అనుష్క ‘భాగమతి’ సినిమా గురించి మాత్రమే పోస్టులు పెట్టడం, ఆమె ట్రైలర్లు, పోస్టర్లు ప్రమోట్ చేయడం చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని మళ్లీ అంతా అనుకుంటున్నారు.

 

తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సెట్‌లో శుక్రవారం రాత్రి అనుష్క సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్, మురళీ శర్మతో కలిసి సెల్ఫీ తీసుకుంది. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సాహో’ సెట్‌లో అనుష్కను చూస్తుంటే.. ఆమె అతిథి పాత్రలో కనిపించబోతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ప్రభాస్, అనుష్క సమ్ థింగ్, సమ్ థింగ్ అంటున్నారు.
 

‘సాహో’లో మొదట అనుష్క శెట్టి పేరునే పరిశీలించారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేశారు. మరి, అనుష్క ‘సాహో’లో ఉంటుందా? లేదా తన ప్రియమైన స్నేహితుడిని కలిసేందుకు మాత్రమే సెట్‌కు వచ్చిందా అనేది త్వరలోనే తెలుస్తుంది.