Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పన్నులు కడుతున్నా నందులు ఇచ్చారట

  • నంది అవార్డుల ఎంపిక కమిటీపై వెల్లువెత్తిన విమర్శలు
  • విమర్శలపై తీవ్రంగా స్పందించిన ఏపీ సర్కారు
  • వివాదం ముదిరితే నందులు రద్దు చేస్తామని ప్రకటన
andhrapradesh government to cancel nandi awards

ఏపీ సర్కారు ఇటీవల ప్రకటించిన నంది అవార్డుల వివాదం రోజు రోజుకు ముదురుతోందే తప్ప సద్దు మణగడంలేదు. ఇప్పటికే ఈ అవార్డులు కుల ప్రీతి, బంధి ప్రీతితో పంచుకున్నారని, అసలు వాటికి సైకిల్ అవార్డులని పేరు పెట్టాలని ఇలా రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. నందులపై సినీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. దీనిపై పెద్దఎత్తున డిబేట్లు కూడా జరిగాయి. ఇక నంది అవార్డుల కమిటీ సభ్యుడు మద్దినేని రమేష్ ఏకంగా దర్శకుడు రాంగోపాల్ వర్మపై బూతులనే వాడాడు.

 

దీంతో సర్కారు తరఫున ఓ పత్రికలో భారీయెత్తును నందికి రాంరాం అంటూ కథనం కూడా వచ్చేసింది. ప్రభుత్వం తరఫున ఎవరో చెప్పినట్లు ఆ కథనం వుండటంతో నంది అవార్డులు నిజంగానే రద్దు చేస్తారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే ఈ గోల ఏమిటంటూ ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయని, అవార్డులను ఇవ్వడం ఇదే తొలిసారి కాదని, కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్నారని, ప్రతిసారి కొంత రచ్చ జరగడం మామూలే అయినా ఈసారి అది శ్రుతి మించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నట్లుగా వార్తలు వ్యాపిస్తున్నాయి.

 

ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ చేయడంలో భాగంగా ఏదో కుట్ర జరుగుతోందని భావించాల్సి వస్తోందని సర్కారు పేర్కొందట. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలోనే ఉంటూ, అక్కడే పన్నులు కడుతున్నా తెలుగు వారంతా ఒక్కటే అన్న ఉద్దేశంతో అవార్డులు ఇస్తుంటే అనవసర రాద్దాంతం చేయడం ఎంత వరకు సబబు? అన్నది సర్కారు వాదన. ఈసారి నంది అవార్డు గ్రహీతల్లో చాలామందికి ఏపీలో కనీసం ఓటు హక్కు కూడా లేదని కూడా ప్రస్తావించింది.

 

నంది అవార్డుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేయడం వరకే ప్రభుత్వం బాధ్యత అని, ఎంపికలో దాని ప్రమేయం ఉండదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలా ఎంపికైన కమిటీలకు చైర్మన్లుగా గిరిబాబు, జీవిత, పోకూరి బాబూరావు ఉన్నారని, వారేమీ అనామకులు కాదని, అత్యంత అనుభవజ్ఞులని గుర్తు చేస్తున్నారు. వివాదం ఇలాగే కొనసాగితే అవార్డులను పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని లీకులిస్తున్నారు.

 

మరి అవార్డులు ప్రకటించక ముందు ఇదంతా తెలియదా... అని, అసలు నంది అవార్డులు తెలుగు వారిని ఉద్దరించే అవార్డులు కావని, కేవలం సినీరంగంలో ప్రతిభ కనబరిచిన వారికిచ్చే అవార్డులు తప్ప జాతి మొత్తానికి ఆపాదించాల్సిన అవసరం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఓటు హక్కులు, పన్నులు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్న సర్కారు వారికి అవార్డులు ప్రకటించక ముందు ఈ అంశాలన్నీ తెలియకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలా అయితే ఇక్కడ ఇల్లున్న వారు అవార్డులకు అనర్హులయితే... ఇక్కడ ఇల్లున్న వాల్లు సీఎం పదవికి మాత్రం ఎలా అర్హులవుతారంటూ ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios