రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో చలపతిరావు పరుష వ్యాఖ్యలు చలపతిరావు వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళా లోకం చలపతిరావు వ్యాఖ్యలకు సూపర్ అంటూ కోరస్ పాడిన రవిపైనా కేసు రవి అలాంటోడు కాదంటున్న యాంకర్లు శ్రీముఖి, గీత
రారండోయ్ వేడుక చూద్దాం ఈ 26న శుక్రవారం రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే ప్రింట్స్ అన్నీ ఆయా థియేటర్లకు కూడా చేరుకున్నాయని నిర్మాత నాగార్జున ప్రకటించారు. సినిమా ప్రమోషన్ కూడా జోరుగానే సాగుతోంది. గత ఆదివారం జరిగిన ఆడియో వేడుక ద్వారా మరింత పబ్లిసిటీ వస్తుందనుకుంటే ఊహించనంతత పబ్లిసిటీ సినిమా సొంతమైంది. అయితే ఈ పబ్లిసిటీ ఇప్పుడు సినిమా విడుదలపై ప్రభావం చూపే స్థాయికి వెళ్లిందంటే ఏ రేంజ్ పబ్లిసిటీ వచ్చిందో ఊహించుకోవచ్చు.
రారండోయ్ వేడుక చూద్దాం చిత్ర ఆడియో వేడుక అంగరంబ వైభవంగా జరిగింది. ఈ చిత్ర ఆడియో వేడుక సందర్భంగా.. మూవీకి సహజంగా ఉండే ఓ ట్యాగ్ లైన్ “అమ్మాయిలు హానికరం” అన్న అంశాన్ని ప్రశ్నగా అందర్నీ అడుగుతూ.. యాంకర్ గీత సీనియర్ నటుడు చలపతిరావును కూడా సార్.. అమ్మాయిలు హానికరమా.. అని అడగ్గా.. హానికరమో కాదోగాని.. పక్కలోకైతే పనికొస్తారు అని సమాధానం చెప్పడంతో... అంతా షాక్ కు గురయ్యారు.
ఈ సందర్భంలో చలపతిరావు అలా కమెంట్ చేయగానే యాంకర్ రవి సూపర్ అంటూ కోరస్ పాడటం అందర్నీ షాక్ కు గురిచేసింది. దీంతో చలపతిరావుతోపాటు యాంకర్ రవిపైనా కేసు నమోదు చేశారు. అయితే.. తాను ఆడియో సరిగా వినపడకపోవడం వల్లనే అలా అన్నాని, నిజంగా అది వినపడి ఉంటే.. నేను కౌంటర్ ఇచ్చేవాడినని రవి అంటున్నాడు. అంతే కాదు.. తనకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా నష్ట నివారణ చర్యల్లో యాంకర్స్ గీత, శ్రీముఖిలతో వివరణలమీద వివరణలు ఇప్పిస్తున్నాడు.
తప్పంతా ఆడియో సిస్టమ్ దే అని, తను అమ్మాయిలను కించపరచలేదని రవి అంటున్నాడు. పటాస్ లాంటి డబుల్ మీనింగ్ చెత్త షోలు నిర్వహించే వాళ్లు రవికి మద్దతు ఇవ్వక మరేం చేస్తారు. అది వేరనుకోండి. కానీ.. చేసిందంతా చేసి.. సూపర్ అనటమే కాకుండా.. ఇప్పుడు యమా కవర్ చేసేస్తున్నాడు. అసలు వినపడకపోతే ఎవడన్నా సూపర్ అంటాడా.. ఏమో పచ్చ కామెర్లోడికి అంతా సూపర్ గానే అనిపిస్తుందేమో.
ఏదేమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వాటిని సమర్థించడం మాత్రం యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోంది. వీళ్లకు కఠిన శిక్ష పడే వరకు వదిలే ప్రసక్తే లేదని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
మరోవైపు మా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. కూడా చలపతిరావు వ్యాఖ్యలను ఖండించింది. ఈ ఘటన పరిశ్రమలో ఉండేవాళ్లందరికీ ఒక గుణపాఠం అయిందని మా అధ్యక్షుడు శివాజీ రాజా, కార్యదర్శి నరేష్ అన్నారు.
