యాంకర్ రవి వ్యాఖ్యలపై మండిపడ్డ లాస్య రవికి వ్యతిరేకంగా వచ్చిన వీడియోను షేర్ చేసిన లాస్య గతంలో చాలా షోల్లో రవితో రాసుకు పూసుకు తిరిగిన లాస్య

‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుక సందర్భంగా సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై అభ్యంతకర రీతిలో వ్యాఖ్యలు చేసి ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారో.. ఆయన వ్యాఖ్యలకు స్పందిస్తూ సూపర్ అంటూ... కోరస్ పాడిన యాంకర్ రవిపై కూడా అదే స్థాయిలో మహిళలు విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు తాజాగా విమర్శకుల జాబితాలో రవికి చాలా క్లోజ్ గా ఉండే(ది) లాస్య కూడా చేరింది.

తనకు చలపతిరావు ఏం చెప్పారో వినబడలేదని.. ఏదో పంచ్ వేశారనుకుని సూపర్ అన్నానంటూ.. సౌండ్ ఆడియో సిస్టమ్ దే తప్పంటూ.. కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా.. రవి అడ్డంగా దొరికిపోయి ఇలా కవర్ చేస్తున్నాడని అంతా మరింత దుమ్మెత్తి పోస్తున్నారు. సూపర్ అంటూ చలపతిరావు వ్యాఖ్యలకు రవి ఇచ్చిన కోరస్ ను.. అతడి వాదనను తప్పుబడుతూ.. సోషల్ మీడియాలో తెగ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు నెటిజన్లు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇటీవల రవి వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ వీజే రిలీజ్ చేసిన వీడియోను యాంకర్ లాస్య షేర్ చేసి.. బాగా చెప్పావ్.. నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా అని పేర్కొంది.

నిజానికి గతంలో రవి.. లాస్య కలిసి చాలా టీవీ,స్టేజ్ షోలు చేశారు. ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘సంథింగ్ స్పెషల్’ సూపర్ పాపులరైంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనుకునేంతగా ఉండేది వాళ్ల కెమిస్ట్రీ. ఐతే తర్వాతి కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ మధ్యే లాస్య పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇలాంటి తరుణంలో ఆమె రవికి వ్యతిరేకంగా ఉన్న వీడియోను షేర్ చేయడం చూస్తే ఇద్దరి మధ్య ఏదో జరిగే ఉంటుందని, అందుకే ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోందేమో అని అంతా సందేహించాల్సి వస్తోంది.